భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి నిత్యకల్యాణం వైభవోపేతంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలోని రామసేవా మండపంలో స్వామివారిని కొలువు దీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు.
నేడు రుద్రహోమం పూజలు
మాస శివరాత్రిని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి ఆలయంలో శనివారం రుద్రహోమ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. భక్తులు రూ.1,516 చెల్లించి గోత్రనామాలను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
ముర్రేడు వాగు రిటైనింగ్ వాల్‌కు రూ.50 కోట్లు
సూపర్‌బజార్(కొత్తగూడెం): ముర్రేడు వాగు వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం చూపుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.50.50 కోట్ల నిధులు మంజూరు చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వివరాలు వెల్లడించారు. జనావాసాల మధ్య ప్రవహిస్తున్న ముర్రేడు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వాగులో వరద ఉధృతితో శ్రీనగర్, ప్రశాంతి నగర్, సాయినగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. శ్మశాన వాటికలకు వెళ్లే మార్గాలు సైతం మునిగిపోయి ప్రజలు నరకయాతన అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులపై ఒత్తిడి తేగా వాగుకు ఇరువైపులా రక్షణ గోడ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
వైటీసీలో వ్యవసాయ డ్రోన్ శిక్షణ
భద్రాచలం: రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో వ్యవసాయ డ్రోన్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. పంటలకు పురుగుమందులు, ఎరువులను వేగంగా పిచికారీకి శిక్షణ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు వైటీసీలో సంప్రదించాలని కోరారు.
విద్యార్థికి స్వర్ణపతకం
పాల్వంచ: పాఠశాలల క్రీడా సమాఖ్య నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్వంచ ఆదర్శ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ విద్యార్థి పి.షణ్ముఖ్ ప్రతిభ కనబర్చాడు. శుక్రవారం ఖమ్మంలో జరిగిన పోటీల్లో 45 కేజీల విభాగంలో స్వర్ణపతకం సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రెంటల నాగభూషణం, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.
మెరుగైన వైద్య సేవలు
అందించాలి
చుంచుపల్లి: ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. శుక్రవారం కొత్తగూడెంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని సందర్శించారు. వివిధ విభాగాల్లో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వైద్యులు అందుతున్న తీరును తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి పర్యవేక్షకులు, సంబంధిత వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. వివిధ వైద్య కార్యక్రమాల అమలు తీరు, విభాగాల మధ్య సమన్వయం, సేవలందించడంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ రాధామోహన్, గుండెపోటు చికిత్స విభాగం బాధ్యులు డాక్టర్ సందీప్, డాక్టర్ దినేష్, డాక్టర్ రాకేష్, హరికిషన్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


