మందుల ఆనవాళ్లతో ఆర్డర్లకు బ్రేక్?
ఈ ఏడాది ధర ఉన్నా రైతుల్లో దిగాలే
వేధిస్తున్న తెగుళ్లు, ఎల్‌నినో ప్రభావం
గత మూడేళ్లుగా మిర్చి సాగు (ఎకరాల్లో)
ఖమ్మంవ్యవసాయం: దేశంలోనే మిర్చి సాగులో తెలుగు రాష్ట్రాలది ప్రత్యేక స్థానం. అందులోనూ విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉన్న ‘తేజ’ రకం మిర్చి ఖమ్మం జిల్లాలోనూ అత్యధిక సాగవుతోంది. కానీ కొన్నాళ్లుగా ఈరకం సాగు చేసే రైతులు ప్రతికూల పరి స్థితులను ఎదుర్కొంటున్నారు. తెగుళ్లకు తోడు చైనా నుంచి ఆర్డర్లుతగ్గడం.. ఎల్‌నినోతో నీటిఎద్దడి, క్రిమి సంహారకాల ప్రభావంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటుండగా, ఆ ప్రభావం సాగుపై పడుతోంది.
ధరలో ఒడిదుడుకులు
చైనాకు తేజ రకం మిర్చి ఎగుమతులు జోరుగా సాగిన 2023లో క్వింటాకు రూ.25వేల ధర పలికింది. ఆ తర్వాత చైనాలో కూడా ఈ రకం సాగు పెరగడం, ఇక్కడ క్రిమిసంహారకాల సమస్య తోడవడంతో ఎగుమతులు మందగించి 2024లో ధర రూ.12 వేలకు పతనమైంది. ఈ ఏడాది చైనా ఆర్డర్లు లేకున్నా దేశీయ మార్కెట్‌తో పాటు బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్ దేశాలకు ఎగుమతులు జరుగుతుండటంతో ధర నిలకడగా ఉంది. సీజన్‌లో సగటున రూ.18 వేలు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చికి ప్రస్తుతం రూ.23,500 పలుకుతోంది.
పెట్టుబడులు.. ఎల్‌నినో వాత
మిర్చి సాగు ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. మూడేళ్లుగా తామర పురుగు పూత, పిందె దశలో ఆశించి పంటను నాశనం చేస్తుండగా, ఈ ఏడాది జెమినీ వైరస్ తోడైంది. గత ఏడాది మంచి ధర ఉండడంతో ఈసారి రైతులు సాగుకు సిద్ధమవుతుండగా, ఎల్‌నినో వారి ఆశలను కమ్మేసింది. 2024–25లో 59,205 ఎకరాలు, 2025–26లో 31,713 ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం ఈ ఏడాది 35,343 ఎకరాలుగా నమోదైంది. గత ఏడాది పోలిస్తే కాస్త ఎక్కువే అయినా జిల్లా పరిస్థితులను పరిశీలిస్తే మాత్రం ఆశాజనకం కాదని చెబుతున్నారు. 2024లో 10,954 వేల సాగు విస్తీర్ణం కలిగిన రఘునాథపాలెం మండలంలో ఈ ఏడాది కేవలం 5,397 ఎకరాల్లోనే మిర్చి సాగు చేయడం గమనార్హం.
ఖమ్మం ప్రాంతంలో పండించే తేజ రకం మిర్చిలో క్రిమిసంహారకాల(ఫెస్టిసైడ్ రెసిడ్యూ) శాతం ఎక్కువగా ఉంటోందనే కారణంతో చైనా నుంచి ఆర్డర్లు మందగించాయనే చర్చ వ్యాపారుల్లో సాగుతోంది. తామర పురుగు, జెమినీ వైరస్‌ను అరికట్టేందుకు రైతులు మోతాదుకు మించి పురుగు మందులు పిచికారీ చేస్తుండడంతో ఆ అవశేషాలు మిగిలిపోతుండడం, అంతర్జాతీయ ప్రమాణాలకు ఆటంకంగా మారుతోందని చెబుతున్నారు.
మిర్చి సాగుకు
కేంద్ర బిందువుగా ఖమ్మం
జిల్లా 2024–25 2025–26 2026–27
ఖమ్మం 59,205.23 31,713.22 35,343.00
భద్రాద్రి 17,590.28 9,695.38 8,369.00
మొత్తం 76,796.11 41,409.20 43,712.00


