ఖమ్మంమయూరిసెంటర్/కొత్తగూడెంఅర్బన్: అశ్వాపురంలో కదులుతున్న బస్సు నుంచి ప్రయాణికురాలు తోసేయగా తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న మణుగూరు డిపో కండక్టర్ జి.ప్రవళికను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే, కూనంనేని సాంబశివరావు శుక్రవారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆస్పత్రిలో ఆమెను పరామర్శించిన కూనంనేని, చికిత్సపై వైద్యులతో మాట్లాడడమే కాక ఆమె తల్లికి ఽధైర్యం చెప్పారు. సీపీఐ, ఏఐటీయూసీ, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రవళికకు అండగా ఉంటాయని తెలిపారు.
సింగరేణిలో చెస్, క్యారమ్స్ పోటీలు
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియాలోని సీఈఆర్ క్లబ్‌లో శుక్రవారం సింగరేణి కార్మికులకు కంపెనీస్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు వివిధ ప్రాంతాల కార్మికులకు హాజరయ్యారు. పోటీలను ఏరియా జీఎం సీహెచ్ వెంకటరమణ ప్రారంభించి మాట్లాడారు. క్రీడాస్ఫూర్తి చాటాలని సూచించారు. జీఎంలు జీవీ కిరణ్‌కుమార్, ఏజేఎం మురళీధర్ రావు, కే.అజయ్‌కుమార్, ఎస్‌ఓటూ జీఎం గోవిందరావు పాల్గొన్నారు.
ఎన్‌సీసీ విద్యార్థినికి అభినందనలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జాతీయస్థాయిలో శిక్షణ పొందిన ఎన్‌సీసీ విద్యార్థినిని సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ జీ.రాజేంద్రప్రసాద్ శుక్రవారం అభినందించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కామెర్జ్ జిల్లా దిరాంగ్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు అడ్వెంచర్ మౌంటెనీరింగ్ శిక్షణ నిర్వహించారు. సింగరేణి మహిళా కళాశాల డిగ్రీ విద్యార్థిని శ్రీహరిణి శిక్షణలో పాల్గొని, రాక్ క్‌లైంబింగ్, జిప్‌లైన్, టెంట్ పిచింగ్, సర్వైవల్ టెక్నిక్స్, స్ట్రీమ్ క్రాసింగ్, ట్రెక్కింగ్, హైకింగ్‌లో తర్ఫీదు పొందింది. ఈ సందర్భంగా ఆమెను సొసైటీ సెక్రటరీతోపాటు కమాండ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్ భద్ర, ప్రిన్సిపాల్ చింతా శారద, ఎన్‌సీసీ ఆఫీసర్ శ్రీలత అభినందించారు.
అథ్లెట్‌కు ఎస్పీ అభినందనలు
కరకగూడెం: మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన గిరిజన బాలిక తోలెం శ్రీ తేజ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని రెండు బంగారు పతకాలు సాధించింది. శుక్రవారం ఆమెను ఎస్పీ రోహిత్ రాజు జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో అభినందించారు. చైన్నెలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 41వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హార్డిల్స్, హెప్టాథ్లాన్ విభాగాల్లో శ్రీ తేజ స్వర్ణ పతకాలు సాధించింది. పి.నాగేంద్ర బాబు, కె.మహీధర్ పాల్గొన్నారు.
నేటి నుంచి రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఖమ్మంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే పోటీలకు రాష్ట్రంలో పది ఉమ్మడి జిల్లాల నుంచి జట్లు హాజరుకానున్నాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగే మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశామని, ఫ్లడ్ లైట్ల వెలుతురులో మ్యాచ్‌లు జరుగుతాయని హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వరికూటి మోహన్ తెలిపారు.


