ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో ఉంటూ ఇంటర్ చదువుతున్న విద్యార్థి మృతి చెందగా.. వార్డెన్ నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామానికి చెందిన అచన అజయ్‌కుమార్ (17) ఖమ్మంలోని బీసీ బాలుర కళాశాల వసతిగృహంలో ఉంటూ ఏఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్(ఎంఎల్‌టీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మరుగుదొడ్డికి వెళ్లిన ఆయన కుప్పకూలాడు. ఎంతకూ బయటకు రాకపోవడంతో గమనించిన తోటి విద్యార్థులు చూడగా కుప్పకూలి ఉండడంతో 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, అజయ్ రెండు రోజులుగా అనారోగ్యంతో ఉండడంతో శుక్రవారం కళాశాలకు వెళ్లకపోగా, అప్పటివరకు తమతో గడిపిన ఆయన మృతితో స్నేహితులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
కన్నీరుమున్నీరైన తల్లి
వ్యవసాయ కూలీలైన లక్ష్మీనారాయణ – ఉపేంద్ర దంపతులకు ముగ్గురు సంతానం. లక్ష్మీనారాయణ 2015లో మృతి చెందడంతో తల్లి పిల్లలను పోషిస్తోంది. ఈక్రమాన హఠాత్తుగా అజయ్ మృతితో తల్లి, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, విద్యార్థి సంఘాల నాయకులు, బంధువులు జీజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకున్నారు. అజయ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినందున సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. అంతేకాక బాధిత కుటుంబానికి పరిహారం అందించాలన్నారు. ఈమేరకు బీసీ డీడీ జి.జ్యోతి చేరుకుని వారికి నచ్చచెప్పారు.


