పినపాక: పొరుగు రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఆదివాసీ యువకుడు తిరిగివెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన వలస ఆదివాసీలు కరకగూడెం మండలం రేగళ్ల ఫారెస్ట్ బీట్ పరిధిలో పనులు ముగించుకుని శుక్రవారం ఉదయం ఆటోలో భద్రాచలం బయల్దేరారు. ఈ క్రమంలో కరుము ఇర్మా (29) అనే యువకుడు ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారిపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో పినపాక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఈ.బయ్యారం ఎస్సై రఘు తెలిపారు.
వివాహిత అదృశ్యం
పాల్వంచరూరల్: వివాహిత అదృశ్యంపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన మోడిగం నాగరాజుకు ములకలపల్లి మండలం రాసన్నపేట గ్రామానికి చెందిన రామలక్ష్మి(26)తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ నెల 3న ఆమె తన తండ్రితో కలిసి కూలి పనుల నిమిత్తం జగన్నాథపురం గ్రామానికి వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. ఆచూకీ లేకపోవడంతో భర్త నాగరాజు ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
భద్రాచలంలో మరొకరు..
భద్రాచలం అర్బన్: భద్రాచలంలోని ఓ వివాహిత అదృశ్యంపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. చర్ల మండలం సత్యనారాయణపురానికి చెందిన కుప్ప ఆనంద్ కుమార్ భార్య మహాలక్ష్మి భద్రాచలం పట్టణంలోని ఏఎస్సార్ కాలనీలో నివాసం ఉంటోంది. శుక్రవారం ఉదయం మందులు కొనుగోలుకు చర్లరోడ్డులోని ఎల్‌ఐసీ కార్యాలయంలో సమీపంలో ఉన్న మెడికల్ షాపునకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ విషయాన్ని మహాలక్ష్మి సోదరుడు ఫోన్ ద్వారా హైదరాబాద్‌లో ఉన్న ఆనంద్‌కుమార్‌కు తెలిపాడు. దీంతో ఆయన భద్రాచలం చేరుకుని కుటుంబీకులతోపాటు వెతికినా ఆచూకీ లేదు. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హత్యాయత్నంపై కేసు నమోదు
రఘునాథపాలెం: భూవివాదం నేపథ్యాన ఓ వ్యక్తిపై ఇద్దరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన వేపకుంట్ల రెవెన్యూ పరిధిలో గురువారం జరిగింది. బాధితుడు భద్రు కుమారుడి ఫిర్యాదుతో లచ్చు, వీరన్నలపై శుక్రవారం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.


