రెండో స్థానంలో నిలిచిన రంగారెడ్డి
బహుమతులు అందజేసిన
మంత్రి పొంగులేటి
సత్తుపల్లి: క్రీడాకారిణులు శివంగుల్లా చివరివరకు నువ్వా, నేనా అన్నట్లు తలపడ్డారు. క్షణక్షణం ఉత్కంఠతో మ్యాచ్ సాగగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ఫైనల్స్‌లో నల్లగొండ జిల్లా జట్టు రంగారెడ్డి జిల్లా జట్టుపై విజయం సాధించి ట్రోఫీ దక్కించుకుంది. సత్తుపల్లిలో మూడు రోజులుగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ – మువ్వా విజయ్‌బాబు యువసేన ఆధ్వర్యాన్న నిర్వహిస్తున్న 73వ రాష్ట్ర సీనియర్ మహిళా కబడ్డీ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఫైనల్స్‌లో నల్లగొండ – రంగారెడ్డి జిల్లాల జట్లు తలపడగా నల్లగొండ జట్టు 44 పాయింట్లు సాధించింది. రంగారెడ్డి జట్టు 29 పాయింట్లకే పరిమితం కావడంతో 15 పాయింట్ల తేడాతో నల్లగొండ జట్టు ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి కబడ్డీ కూతకు వెళ్లి ప్రారంభించారు.
సెమీస్‌లోనూ హోరాహోరీ
ఫ్రీ క్వార్టర్స్ తర్వాత సెమీ ఫైనల్స్‌కు ఖమ్మం, రంగారెడ్డి, నల్లగొండ, జనగామ జిల్లాల జట్లు చేరాయి. ఖమ్మం – రంగారెడ్డి జట్ల మధ్య జరిగిన సెమీస్‌లో ఖమ్మం జట్టు తొలుత పైచేయి సాధించినా చివరి 15 నిమిషాల్లో తలకిందులై రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. మరో సెమీస్‌లో జనగామ జట్టుపై నల్లగొండ సునాయాసంగా గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది.
అంతర్జాతీయ స్థాయిలో గేమ్ సిటీ
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో గేమ్ సిటీని నిర్మిస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహిళా కబడ్డీ టోర్నీ విజేత నల్లగొండ, రన్నరప్‌గా నిలిచిన రంగారెడ్డి జట్లకు ట్రోఫీలు అందజేశాక మంత్రి మాట్లాడుతూ తెలంగాణ క్రీడాకారులు ప్రపంచ దేశాలతో పోటీపడేలా క్రీడా పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో మాదిరి క్రీడల్లోనూ దూసుకెళ్లడం ఆనందంగా ఉందని తెలిపారు. టీజీఐటీసీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ టోర్నీ నల్లగొండలో జరగాల్సి ఉన్నా, మంత్రి పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం జిల్లాకు అవకాశం ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ఇల్లెందు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, కబడ్డీ అసోసియేషన్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బాధ్యులు కటికల క్రిస్టోఫర్‌బాబు, కె.స్వాతిముత్యం, సీహెచ్.సుధాకర్, సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ చైర్మన్లు ఎం.డీ.రెహానాబేగం, మోహన్‌నాయక్, ఉద్యోగ జేసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, నాయకులు దేవీప్రసన్న, డాక్టర్ మట్టా దయానంద్, ఎం.డీ.కమల్‌పాషా, మందపాటి ముత్తారెడ్డి, తోట సుజలరాణి, గణేష్, బొంతు వేణు, గాదె చెన్నారావు, మట్టా ప్రసాద్, ఎస్.కే.మౌలాలీ, కూకలకుంట దయాకర్, పీఈటీలు, పీడీలు, కోచ్‌లు పాల్గొన్నారు.


