కలెక్షన్ సెంటర్లు వేదికగా..
ఎఫ్‌ఎఫ్‌బీ ఇన్‌పుట్, అవుట్‌పుట్ మధ్య తేడాలు
అక్రమార్కులపై చర్యలు చేపట్టని ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: టీజీ ఆయిల్‌ఫెడ్‌లో ఐదేళ్ల క్రితం ఎఫ్ కోడ్, ట్రాన్స్‌పోర్ట్ కోడ్ దుర్వినియోగంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగు చూసినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. దీంతో సిండికేట్ మాఫియా మరింత రెచ్చిపోయి అవినీతి అక్రమాలకు పాల్పడుతోంది. 2021లో పామాయిల్ గెలల తరలింపు వ్యవహారంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఎర్రుపాలెం మండలానికి చెందిన ఓ మహిళకు నాలుగు ఎకరాల తోట ఉండగా, ఆమె ఎఫ్ కోడ్‌పై ఏకంగా 19 వేల టన్నుల పామాయిల్ గెలలను ఫ్యాక్టరీకి తరలించినట్టుగా రికార్డుల్లో నమోదైంది. ఈ వ్యవహారంపై కొందరు రైతులు ఫిర్యాదు చేయడంతో విజిజెన్స్ విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. విచారణ నివేదిక వివరాలను కనీసం సమాచార హక్కు చట్టం కింద కూడా ఇవ్వడం లేదు. మోసానికి సంబంధించిన వివరాలు రహస్య సమాచారం కేటగిరీలో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం.
అవినీతి జల్లు
నిబంధనల ప్రకారం కలెక్షన్ సెంటర్‌కు వచ్చిన ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (ఎఫ్‌ఎఫ్‌బీ)లను 24 గంటల్లో ఫ్యాక్టరీకి తరలించి క్రషింగ్ చేయాలి. అయితే, లారీ/ట్రాక్టర్ లోడు రాలేదనే కారణంతో కొందరు నిర్వాహకులు నాలుగైదు రోజుల వరకు కోసిన ఫ్రూట్‌ను కలెక్షన్ సెంటర్‌లోనే ఉంచుతున్నారు. గెలలు ఎండిపోతే క్రషింగ్ ద్వారా వచ్చే ఆయిల్‌శాతం కొంత మేర తగ్గుతుంది. దీన్ని నివారించేందుకు గెలలపై నీళ్లు చల్లుతారు. దీన్ని ఆధారంగా చేసుకుని గెలలపై విపరీతంగా నీళ్లు చల్లుతూ కృత్రిమంగా అధిక బరువు చూపించి, ఆ మేరకు బినామీ ఎఫ్‌కోడ్, ట్రాన్స్‌పోర్ట్ కోడ్‌ల ద్వారా టీజీ ఆయిల్ ఫెడ్ నుంచి అధికంగా చెల్లింపులు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది.
పక్కదారి పడుతున్న గెలలు
కలెక్షన్ కేంద్రానికి ఎన్ని టన్నుల పామాయిల్ గెలలు వచ్చాయి. అందులో ఫ్యాక్టరీకి చేరింది ఎన్ని టన్నులు ? ఈ రెండింటి మధ్యలో ఏం జరుగుతుందనే విషయాలపై పారదర్శకత, నిఘా కరువైంది. దీంతో ఇక్కడ కొత్త రకం నయవంచన కొనసాగుతోంది. కలెక్షన్ సెంటర్‌లో సేకరించిన గెలల్లో కొంత మొత్తం నిత్యం పక్కదారి పడుతోంది. ఇలా పక్కదారి పట్టిన ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (ఎఫ్‌ఎఫ్‌బీ, గెలలు) ఇటీవల అందుబాటులోకి వచ్చిన ప్రైవేటు పామాయిల్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్టు బలమైన ఆరోపణలు ఉన్నాయి. దీనికి తగ్గట్టే 2024 నవంబరు 1 నుంచి 2026 అక్టోబరు 31 వరకు పరిగణించే ఆయిల్ ఇయర్‌లో అన్ని కలెక్షన్ సెంటర్లకు వచ్చిన ఎఫ్‌బీబీకి ప్రభుత్వ ఫ్యాక్టరీలకు చేరిన ఎఫ్‌ఎఫ్‌బీల మధ్య అంతరం ఏకంగా ఆరువేల టన్నులకు పైగా ఉంది. ఈ తేడాకు బాధ్యులైన కలెక్షన్ సెంటర్ ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లు, సదరు సెంటర్ బాధ్యుడైన టీజీఫెడ్ ఉద్యోగి నుంచి ముక్కుపిండి వసూలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వీరికి సహకరించిన టీజీఫెడ్ అధికారులు, సిబ్బందిపై శాఖపరమైన చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంది. కానీ ఇటువంటి చర్యలేవి కనిపించడం లేదు.
ఎఫ్ కోడ్ దుర్వినియోగంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో సిండికేట్ ఈసారి గెలల కలెక్షన్ సెంటర్లు వేదికగా ఎంచుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పామాయిల్ తోటల నుంచి గెలలను సేకరించేందుకు టీజీ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పామాయిల్ కలెక్షన్లు సెంటర్లు ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ నుంచి దూర ప్రాంతంలో ఉన్న రైతులు తమ పామాయిల్ గెలలను కలెక్షన్ కేంద్రానికి తెస్తారు. అక్కడి నుంచి ఫ్యాక్టరీ వరకు రవాణా చేసే బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్ పద్ధతిలో అప్పగిస్తారు. అయితే, క్షేత్రస్థాయిలో కలెక్షన్ సెంటర్స్ నిర్వహణ రవాణా బాధ్యతలు చూసే కాంట్రాక్టర్ల చేతుల్లోకి క్రమంగా వెళ్లిపోతోంది. ఫలితంగా ఇక్కడ అవినీతికి ఆస్కారం ఏర్పడుతోంది.
పామాయిల్ గెలల కలెక్షన్ కేంద్రాల్లో మాయాజాలం


