గిరిజన సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

గిరిజన సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ

Oct 31 2026 12:25 AM | Updated on Oct 31 2026 12:25 AM

● బిర్సా ముండా జయంతి వేడుకలకు ఏర్పాట్లు ● ఐటీడీఏ పీఓ రాహుల్‌

● బిర్సా ముండా జయంతి వేడుకలకు ఏర్పాట్లు ● ఐటీడీఏ పీఓ రాహుల్‌

భద్రాచలం: ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌ తెలిపారు. వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్‌ సెక్రటరీ, డైరెక్టర్‌ బీఎం సంతోష్‌ శుక్రవారం వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలోని వైద్య, విద్యా సంస్థల నిర్వహణ, ఖాళీల భర్తీ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పెండింగ్‌ సమస్యలపై సమీక్షించారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ట్రైబల్‌ టీ–హబ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఐటీడీఏ నుంచి హాజరైన పీఓ మాట్లాడుతూ ఏజెన్సీ పరిధిలోని పీహెచ్‌సీల్లో వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, అవసరమైన చోట నిధులు వెచ్చించి వైద్యులు, రోగులకు ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ప్రీ, పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు, డైట్‌, కాస్మోటిక్స్‌ చార్జీలు, యూనిఫాంల పంపిణీ సకాలంలో జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, జీసీసీ సరుకుల సరఫరా, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు, పీఎం జన్మన్‌, డీఏ–జేజీయూఏ పథకాల పనులపై నవంబర్‌ 15లోగా పూర్తి వివరాలు సమర్పిస్తామని అన్నారు. జన్‌జాతీయ గౌరవ దివస్‌లో భాగంగా నవంబర్‌ 1 నుంచి 15 వరకు గిరిజన గ్రామాల్లో బిర్సా ముండా జయంతి వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు.

విద్యార్థుల్లో గోవిజ్ఞానంపై ఆసక్తి పెంపు

గిరిజన విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు గో సేవ ఆధ్వర్యంలో నిర్వహించే గోవిజ్ఞాన పరీక్షల్లో ఐటీడీఏ పరిధిలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని పీఓ రాహుల్‌ సూచించారు. శనివారం తన చాబర్‌లో గోవిజ్ఞాన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవంబర్‌ 7న కొత్తగూడెంలోని స్వర్ణభారతి హైస్కూల్‌లో జిల్లా స్థాయి పరీక్షలు, 15న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల నగదు బహుమతులు అందజేస్తామని అన్నారు. అనంతరం ఐటీడీలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీ చాంబర్‌ను ప్రారంభించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో పెండింగ్‌లో ఉన్న పెండింగ్‌ బిల్లులను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు డేవిడ్‌ రాజ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement