సూపర్‌బజార్(కొత్తగూడెం)/ఇల్లెందు: పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లాలో పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. కొత్తగూడెం క్లబ్‌లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా, ఎస్పీ రోహిత్‌రాజు హాజరై మాట్లాడారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ, బైక్ ర్యాలీ, వ్యాసరచన పోటీలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలతోపాటు అన్ని సబ్ డివిజన్ల పరిధిలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం రక్తదాతలకు ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. పండ్లు పంపిణీ చేశారు. ఇల్లెందు పట్టణంలోని రాజస్థాన్ సేవా ట్రస్ట్ ఫంక్షన్ హాల్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సింగరేణి జీఎం వీసం కృష్ణయ్య, డీఎస్పీ వెంకన్నబాబు హాజరైన మాట్లాడారు. రక్తదానంతో ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. శిబిరంలో సేకరించిన రక్తాన్ని తలసేమియా బాధితుల కోసం సంకల్ప సేవా సమితికి అందజేస్తామని తెలిపారు. శిబిరంలో విద్యార్థులు, యువకులు, మహిళలు, రాజకీయ ప్రముఖులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు తదితరులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో డీఎంహెచ్‌ఓ తుకారాం నాయక్, డీఎస్పీలు ఆదినారాయణ, మల్లయ్య స్వామి, సత్యనారాయణ, సీఐలు బత్తుల సత్యనారాయణ, సురేష్, తిరుపతి, వెంకటేశ్వర్లు, శ్రీలక్ష్మి, జితేందర్, యాసిన్, ఇంద్రసేనారెడ్డి, కరుణాకర్, నరేష్, ఆర్‌ఐలు రవి, లాల్‌బాబు, కృష్ణారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


