● దశలవారీగా మంజూరు చేస్తాం ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంరూరల్: రాష్ట్రంలో అర్హులైన పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఖమ్మం రూరల్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని 176 మందికి రెండో విడతలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు కలెక్టర్ దివాకర టీ.ఎస్‌తో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చాక పేదల సొంతింటి కలను నిజం చేయాలనే తపనతో పనిచేస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో మరో లక్ష ఇళ్లు కలిపితే రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇళ్లను నిర్మించేలా రూ.40 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పథకం వంద శాతం పేదోళ్ల మనసు దోచిన, మెచ్చిన పథకమని తెలిపారు. అర్హతే ప్రామాణికంగా కులం, మతం, పార్టీ చూడకుండా ఇళ్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని గావుకేకలు పెట్టినా, దండాలు పెట్టినా, క్షుద్ర పూజలు చేసినా తమ ప్రభుత్వం ప్రజల దీవెనలతో మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ఏదులాపురం మున్సిపాలిటీకి మొదటి విడతలో 467 ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 400 వరకు పూర్తయ్యాయని తెలిపారు. లబ్ధిదారులకు అత్యంత పారదర్శకంగా ఎంపిక చేశామని, ప్రతీ దశలో బిల్లులు సాఫీగా జమ అవుతుండడంతో లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకుంటున్నారని చెప్పారు. అనంతరం ఏదులాపురం మున్సిపాలిటీలో రూ.4.96కోట్లతో నిర్మించే 46 అంతర్గత సీసీ రోడ్లు, రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.


