వైభవంగా రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా రామయ్య కల్యాణం

Oct 31 2026 12:25 AM | Updated on Oct 31 2026 12:25 AM

భద్రాచలం: రామాలయంలో శ్రీ సీతారామ చంద్రస్వామివారి నిత్యకల్యాణం శుక్రవారం వైభవోపేతంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో స్వామివారి కల్యాణ మూర్తులను కొలువుదీర్చి, విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు పూజలు నిర్వహించారు.

ఆలయానికి రూ.లక్ష విరాళం

భద్రాచలంటౌన్‌: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన జీఎస్‌పీ వీరరెడ్డి కుటుంబ సభ్యులు శుక్రవారం రూ.లక్ష విరాళం అందజేశారు. గోశాల నిర్వహణకు రూ.50 వేలు, నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.50 వేలు చొప్పున విరాళాన్ని సమర్పించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఈ విరాళం అందించినట్లు దేవస్థాన వర్గాలు తెలిపాయి.

పెద్దమ్మతల్లికి

పంచామృతాభిషేకం

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు.

5న దీపావళి బోనస్‌

రుద్రంపూర్‌: సింగరేణి సంస్థలోని 12 ఏరియాల్లో పనిచేస్తున్న 40 వేల మంది కార్మికులకు నవంబర్‌ 5న దీపావళి (పీఎల్‌ఆర్‌) బోనస్‌ రూ.1,10,250 చెల్లిస్తామని యాజమాన్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కనీసం 30 మస్టర్లు చేసిన కార్మికులు బోనస్‌ పొందేందుకు అర్హలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సర్ఫేస్‌లో పనిచేసే ఉద్యోగులకు 240 మస్టర్లు, అండర్‌ గ్రౌండ్‌ల్‌ పనిచేసే ఉద్యోగులకు కనీసం 190 మస్టర్లు ఉంటే పూర్తి బోనస్‌ అందుతుందని తెలిపింది. కార్మికులు ఇన్‌కమ్‌టాక్స్‌ పడకుండా భవిష్యత్‌ అవసరాలకోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోవాలని సూచించింది.

రేపు ఎన్‌ఎంఎంఎస్‌

ప్రవేశ పరీక్ష

కొత్తగూడెంఅర్బన్‌: నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ ప్రవేశ పరీక్ష నవంబర్‌ 1న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ ఎస్‌.మాధవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెంలోని బాబుక్యాంపు ప్రభుత్వ పాఠశాల, చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాల, సింగరేణి హై స్కూల్‌, సెయింట్‌ మెరీస్‌ హై స్కూల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8.30 గంటల నుంచి అనుమతిస్తారని, ఇతర వివరాలకు 89192 79238 నంబరులో సంప్రదించాలని వివరించారు.

భద్రాచలం కొత్త వంతెనపై రాకపోకలు బంద్‌

నేటి నుంచి నవంబర్‌ 7 వరకు ఆంక్షలు

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మించిన నూతన హైలెవల్‌ వంతెనపై లోడ్‌ టెస్టింగ్‌ నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం నుంచి నవంబర్‌ 7వ తేదీ వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. ఈ మేరకు భద్రాచలం టౌన్‌ సీఐ రాజు శుక్రవారం ఒక ప్రకటన చేశారు. 8 రోజులపాటు అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధించి, పాత గోదావరి వంతెన మీదుగా మళ్లించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement