భద్రాచలంటౌన్: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలంలో పలు విక్రయ హక్కులు, దుకాణాలకు కొత్త ధరలు ఖరారయ్యాయి. దసరా మండపంలోని 11వ నంబరు దుకాణానికి గతంలో నెలకు రూ.4,100 అద్దె ఉండగా, తాజా వేలంలో రూ.4,500కు ఎం.స్రవంతి దక్కించుకున్నారు. పర్ణశాలలో కొబ్బరికాయల విక్రయ హక్కులు గతంలో రూ.6.45 లక్షలు ఉండగా, తాజా వేలంలో రూ.6.60 లక్షలకు ఎం.దుర్గాప్రసాద్ దక్కించుకున్నారు. పూల విక్రయ హక్కులు గతంలో రూ.1.75 లక్షలు ఉండగా, రూ.1.90 లక్షలకు వై.హరికృష్ణ దక్కించుకున్నారు. ప్రతీ పాటకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. పర్ణశాలలోని డార్మిటరీ హాళ్ల నిర్వహణ హక్కులకు ఎనిమిదోసారి నిర్వహించిన వేలంలో గతంలో రూ.1.95 లక్షలుగా ఉన్న పాట రూ.1.10 లక్షలకు తగ్గింది. ఈ హక్కులను ఎం.శ్రీనివాసరెడ్డి దక్కించుకున్నారు.


