గుండాల ఏకలవ్య పాఠశాలలో
లోపాలపై కలెక్టర్ అంకిత్ ఆగ్రహం
గుండాల: మెనూ అమలు చేయికపోయినా, విద్యార్థులకు అందించాల్సిన భోజనంలో నిర్లక్ష్యం వహించినా కఠినచర్యలు తప్పవని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. గుండాల ఏకలవ్య పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. విద్యాబోధన, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజన సదుపాయాలను పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తరగతులు నిర్వహించాల్సిన సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటమేమిటని ప్రిన్సిపాల్ నితిన్‌సింగ్‌ను ప్రశ్నించారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం, స్టోర్‌రూమ్‌లో ఆలుగడ్డలు కుళ్లిపోయి ఉండటం, పంచదారకు చీమలు పట్టి ఉండటాన్ని గమనించి కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న వంట మనిషిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు శుక్రవారం బిర్యానీ వడ్డించకపోవడంతో ప్రిన్సిపాల్‌కు మెమో జారీ చేశారు. అంతకుముందు మండలంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను పరిశీలించారు. అటవీశాఖ గెజిట్ ప్రకారం నిర్దేశించిన హద్దులు, ఎన్‌క్లోజర్ లేయర్ ఆధారంగా మిగిలిన భూముల సర్వే నిర్వహించాలన్నారు. ఆ తర్వాత గుండాల ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఆస్పత్రిలో సిరంజీలు లేకపోవటంపై కలెక్టర్ ప్రశ్నించగా, ఇండెంట్ పెట్టామని సిబ్బంది తెలిపారు. తహసీల్దార్ సంగీత, ఎంపీడీఓ బాలరాజు, ఎంఈఓ పార్వతి, ఎంపీఓ త్రిలోక్, సర్వేయర్ శివకృష్ణ, సర్పంచ్ రాధ పాల్గొన్నారు.


