వాగుల్లో అధికారికంగా ర్యాంపులు ఏర్పాటు చేయని ప్రభుత్వం
ఇదే అదునుగా అక్రమంగా తరలిస్తున్న మాఫియా
జేసీబీలతో తోడుతూ ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకోని అధికారులు
వాగుల నుంచి జేసీబీలతో...
అశ్వారావుపేటరూరల్: అధికారిక ర్యాంపులు లేకపోవడంతో అక్రమార్కులు దర్జాగా ఇసుక తరలిస్తున్నారు. వాగుల నుంచి ఏకంగా జేసీబీలతో ఇసుక తోడేస్తున్నారు. జిల్లాలోని అశ్వారావుపేట, ములకలపల్లి, పాల్వంచ, బూర్గంపాడుతోపాటు మరికొన్ని మండలాల్లోని వాగుల్లో కోట్లాది రూపాయల విలువైన ఇసుక నిల్వలు ఉన్నాయి. అశ్వారావుపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లోని పెదవాగు, చిన్న వాగు, మొర్రేడు వాగు, కిన్నెరసాని వాగుల్లో నాణ్యమైన ఇసుక లభిస్తోంది. మార్కెట్లో కూడా అధిక డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేయకపోవడం అక్రమార్కులకు కలిసివస్తోంది. నిబంధనలు ఉల్లంఘించి వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. నిత్యం వంద నుంచి రెండొందల ట్రిప్పుల ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా జిల్లా రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామమాత్రంగా కేసులు పెట్టడం, అధికారపార్టీ నాయకులు పైరవీ చేస్తే వదిలేయడం పరిపాటిగా మారింది.
ఊసేలేని ఇసుక ర్యాంపులు..
గత ప్రభుత్వ హయాంలో వాగుల్లో ర్యాంపులు ఏర్పాటు చేసి ‘మన ఇసుక మన వాహనం’పేరుతో ఇసుక తరలించారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు పర్యవేక్షించేవారు. అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం, నందిపాడు పంచాయతీ పరిధిలోని పెదవాగు, ములకలపల్లి మండలం పాములేరు, పాల్వంచ మండలంలోని మొర్రేడు వాగు, కిన్నెరసాని వాగులతో మరికొన్ని చోట్ల అధికారికంగా ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు భారీగా ఆదాయం సమకూరింది. నందిపాడు గ్రామ పంచాయతీకు మూడు నెలల కాలంలోనే సుమారు రూ.50 లక్షల ఆదాయం వచ్చిందంటే రాబడి ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ‘మన ఇసుక వాహనం’ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కానీ ర్యాంపులు ఏర్పాటు చేయలేదు. గడిచిన మూడేళ్లుగా ర్యాంపుల ఊసేలేకపోవడంతో ప్రభుత్వానికి, జీపీలకు రావాల్సిన రూ. కోట్ల ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. అక్రమంగా ఇసుక తరలింపు వ్యవహారంపై జిల్లా మైనింగ్ ఏడీ దినేష్ కుమార్ను వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా పలుమార్లు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
అక్రమార్కులు పట్టపగలే వాగుల్లో జేసీబీలతో ఇసుక తవ్వేస్తున్నారు. వాగుల్లో జేసీబీలతో ఇసుక లోడింగ్ చేయడం మైనింగ్ చట్టానికి విరుద్ధం. నిబంధనలు అమలు చేయాల్సిన, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గడిచిన రెండు నెలలుగా అశ్వారావుపేట మండలంలోని నెమలిపేట, జగన్నాథపురం, అనంతారం, గాండ్లగూడెం, నారాయణపురం గ్రామాల శివారులో పెదవాగు నుంచి జేసీబీలతో ఎత్తి పోస్తూ ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. తెల్లవారుజాము 3గంటల నుంచే ఇసుక తరలించేందుకు వందల కొద్దీ ట్రాక్టర్లు బారులుదీరుతున్నాయి. ఆయా గ్రామ పంచాతీయ బాధ్యులకు ఒక్కో ట్రాక్టర్కు రూ. 200 చొప్పున నజరాన ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను అశ్వారావుపేటలో రూ.3500, దమ్మపేటలో రూ.4500, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రూ.6000 చొప్పున విక్రయిస్తున్నారు.


