చుంచుపల్లి: పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాల్లో జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులకు అవార్డులు లభించాయి. 2025–26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన కాయకల్ప పురస్కారాల్లో గుర్తింపు లభించింది. ఐదు టీవీవీపీ ఆస్పత్రులకు ఆరు కాయకల్ప అవార్డులు ప్రకటించారు. అవార్డులతోపాటు రూ.10 లక్షల ప్రోత్సాహక నగదు లభించనుంది. పాల్వంచ సామాజిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్రస్థాయి పర్యావరణహిత ఆస్పత్రి అవార్డుతోపాటు ప్రశంసా పురస్కారం లభించింది. భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, మణుగూరు ప్రాంతీయ ఆస్పత్రులకు ప్రశంసా పురస్కారాలు దక్కాయి. రాష్ట్రంలో పర్యావరణహిత విభాగంలో ఏకై క రాష్ట్రస్థాయి అవార్డు పాల్వంచ ఆస్పత్రికి రావడం విశేషం. అశ్వారావుపేట, మణుగూరు ఆస్పత్రులు తొలిసారిగా పరిశీలనకు హాజరై అవార్డులు సాధించాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వైద్య వ్యర్థాల నిర్వహణ, ఇన్ఫెక్షన్ల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, రోగులకు అందించే సేవల నాణ్యత ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించారు. కాగా, భద్రాచలం ప్రాంతీయ ఆస్పత్రికి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల ధ్రువీకరణ సాధించేందుకు కృషి చేస్తున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు వెల్లడించారు.
పాల్వంచ సీహెచ్సీకి ఎకో ఫ్రెండ్లీ అవార్డు
పాల్వంచ: పాల్వంచ సీహెచ్సీ 93.69 శాతం మార్కులు సాధించడంతో రూ.లక్ష నగదు పురస్కారానికి, ఎకో ఫ్రెండ్లీ అవార్డు కింద మరో రూ.5లక్షల నగదుతో పురస్కారానికి ఎంపికై ంది. గత మార్చిలో ఆస్పత్రిని కాయకల్ప ప్రతినిధి బృందం పరిశీలించగా, తాజాగా అవార్డు ప్రకటించారు. అవార్డు రావడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.


