జీసీసీ డీఎం రామానందం
భద్రాచలంటౌన్: కొనుగోలు కేంద్రాలకు వచ్చే వరి ధాన్యాన్ని నాణ్యత, తేమశాతం పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని జీసీసీ డీఎం రామానందం సూచించారు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం సివిల్ సప్లైస్ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయొద్దని చెప్పారు. సివిల్ సప్లైస్ టెక్నికల్ ఇన్చార్జి సతీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధాన్యం నాణ్యత, తేమశాతం పరిశీలనపై వివరించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ మేనేజర్ సమ్మయ్య, 30 మంది కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, సిబ్బంది పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
చుంచుపల్లి/పాల్వంచరూరల్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. మండల పరిధి పెద్దమ్మగుడి వద్దనున్న గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్సీ)లో గురువారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. వైద్యసిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని చెప్పారు. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ సబ్బు, శుభ్రమైన నీటితో చేతులను కనీసం 20 సెకన్లపాటు కడుక్కోవడం ద్వారా అంటువ్యాధులను నివారించవచ్చని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సేవలందించే ఆరోగ్య సిబ్బంది చేతుల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
ఆర్టీసీలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్
ఈనెల 17న అధికారికంగా ఫలితాలు వెల్లడి
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ముగిసింది. ఈనెల 9న సాధారణ పోలింగ్ నిర్వహించగా, ఆరోజు విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈమేరకు బుధ, గురువారం రీజియన్‌లోని 45 మందికి గాను 44 మంది ఖమ్మం కలెక్టరేట్లోని కార్మిక శాఖ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర గుర్తింపునకు సంబంధించి ఎంప్లాయీస్ యూనియన్‌కు 27 మంది, టీడబ్ల్యూయూకు 15 మంది ఓటు వేశారు. ఇంకో ఇద్దరి ఓట్లు చెల్లలేదు. ఖమ్మం రీజియన్ స్థాయి గుర్తింపునకు ఎన్ఎంయూకు 15 మంది, ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు 23 మందితో పాటు ఎస్‌డబ్ల్యూయూ, టీజేఎంఎయూ, బీకేయూకు ఒకొక్కరు ఓటు వేయగా.. ఇంకో మూడు ఓట్లు చెల్లలేదు. రాష్ట్ర స్థాయి గుర్తింపు కోసం ఎంప్లాయీస్ యూనియన్‌కు ఓటు వేసిన కార్మికులు, రీజియన్ స్థాయిలో మాత్రం ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు ఓట్లు వేయడం గమనార్హం. సాధారణ పోలింగ్ రోజు నమోదైన ఓట్లకు వీటిని కలిపి 17వ తేదీన అధికారిక ఫలితాలు వెల్లడించనున్నారు.
పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి
దరఖాస్తులు
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రిలో పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ టి.శంకర్ తెలిపారు. డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్లో సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మొదటి ప్రాధాన్యత బైపీసీ విద్యార్థులకు ఇవ్వనుండగా, ఆ తర్వాత ఎంపీసీ, ఇతర అర్హులైన అభ్యర్థులకు కేటాయిస్తామని తెలిపారు. https//tgpmb. telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ కాపీకి అవసరమైన ధ్రువపత్రాలు జత చేసి మెడికల్ కాలేజీలో ఈనెల 24వ తేదీలోగా అందజేయాలని సూచించారు.


