ఖమ్మం నుంచి ఎంపిక
సత్తుపల్లి టౌన్/ఖమ్మం లీగల్: తెలంగాణ హైకోర్టు గురువారం జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై న వారి జాబితాను విడుదల చేసింది. ఈమేరకు ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. వీరిలో ఇద్దరు న్యాయవాదుల కుటుంబ నేపథ్యం ఉన్న వారే.
న్యాయవాదులు, జడ్జిల కుటుంబాలు
జూనియర్ సివిల్ జడ్జిగా సత్తుపల్లికి చెందిన న్యాయవాది మంత్రిప్రగడ వెంకట బాలసాయి నరసింహ అనుదీప్ ఎంపికయ్యారు. ఆయన హైదరాబాద్లో కొంతకాలంగా న్యాయవాద వృత్తిలో కొనసాగిస్తున్నారు. అనుదీప్ తండ్రి దివంగత మంత్రి ప్రగడ వెంకట సత్యనారాయణ కూడా న్యాయవాది కాగా, ఆయన తల్లి రజనీకుమారి దేవాదాయ శాఖలో ఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే, సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన కొత్తపల్లి పద్మజ – కాలంగి వెంకటేశ్వరరావు దంపతుల కుమార్తె హనీషా సైతం జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. సత్తుపల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేసిన వెంకటేశ్వరరావు ప్రస్తుతం విశాఖపట్నం కోర్టులో 15వ ఏడీజేగా ఉన్నారు.
ఇక ఖమ్మం రూరల్ మండలానికి చెందిన పూస మానస కూడా జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఆమె ఖమ్మం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. జిల్లా నుంచి ముగ్గురు జడ్జిలుగా కావడంపై ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు యడ్లపల్లి రమేష్, కొప్పుల రవి, ఉపాధ్యక్షుడు షేక్ జానీమియా, సత్తుపల్లి అధ్యక్షుడు కూకలకుంట రవి, న్యాయవాదులు అభినందించారు.


