జవాబుపత్రాలు.. అటూ, ఇటు! | - | Sakshi
Sakshi News home page

జవాబుపత్రాలు.. అటూ, ఇటు!

Oct 1 2026 12:47 AM | Updated on Oct 1 2026 12:47 AM

● మూల్యాంకనంలో మార్పులు ● నేటి నుంచి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలు ● పారదర్శకత, నాణ్యత కోసమే అంటున్న ప్రభుత్వం

పరీక్షలపై నమ్మకం పెంచేలా...

జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య

కొత్త విధానం ప్రకారమే...

ఇది సరైంది కాదు..

● మూల్యాంకనంలో మార్పులు ● నేటి నుంచి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలు ● పారదర్శకత, నాణ్యత కోసమే అంటున్న ప్రభుత్వం

భద్రాచలం: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే పరీక్షల జవాబుపత్రాలను ఆ స్కూల్‌ ఉపాధ్యాయులే మూల్యాంకనం చేసి మార్కులను ప్రకటించేవారు. ఈ పద్ధతికి ప్రభుత్వం ముగింపు పలికింది. మూల్యాంకనం, మార్కుల్లో పారదర్శకత, నాణ్యతతకు పెద్దపీట వేసేలా మార్పులు తీసుకొచ్చింది. ఈమేరకు గురువారం మొదలుకానున్న సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షల నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా అన్ని పాఠశాలల జవాబుపత్రాలను మండల కేంద్రానికి చేర్చి మూల్యాంకనం చేయిస్తారు. అయితే, ఈ విధానంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా... కేంద్రాల నిర్వహణ, జవాబు పత్రాల భద్రత, సమయపాలనపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తే విజయవంతం అయ్యే అవకాశముంది.

ఎస్‌ఏ–1 తోనే అమల్లోకి

నూతన మూల్యాంకన విధానంపై ఆగస్టులో జీఓ జారీ అయింది. తొలుత ఉపాధ్యాయ సంఘాలు దీన్ని వ్యతిరేకించడంతో కొంత కాలం స్తబ్దత నెలకొంది. ఆతర్వాత కొత్త విధానాన్ని ఉపసంహరించారనే ప్రచారం జరిగినా అఽధికారిక ఉత్తర్వులు రాలేదు. దీంతో పాత జీఓ ప్రకారమే గురువారం నుంచి పాఠశాలల్లో జరిగే సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షల్లో అమలుచేయనున్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే సమాధాన పత్రాలను ప్రధానోపాధ్యాయుల ద్వారా సేకరించి మండల రిసోర్స్‌ సెంటర్‌లో ఎంఈఓ ఆధ్వర్యాన భద్రపరుస్తారు. ఆతర్వాత మండల పరిధిలోని ఇతర పాఠశాల ఉపాధ్యాయులతో జవాబు పత్రాలను 3 – 5 రోజుల్లో మూల్యాంకనం చేయించి ఫలితాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఇందుకోసం ఉపాధ్యాయుల రెమ్యూనరేషన్‌, ఇతర ఏర్పాట్లకు ప్రతీ మండలానికి రూ.10 వేల బడ్జెట్‌ ప్రకటించారు.

కష్టనష్టాలు ఉన్నాయ్‌...

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానంలో మంచీ, చెడు ఉన్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సొంత పాఠశాలల ఉపాధ్యాయులు అక్కడికక్కడే మూల్యాంకనం చేస్తున్నారు. కానీ ఇతర ఎమ్మార్సీకి లేదా ఇతర పాఠశాలలకు పంపించి మూల్యాంకనం చేయించి మార్కులు అందడానికి సమయం పడుతుందని చెబుతున్నారు. ఇక మార్కులు నిష్పక్షపాతంగా కేటాయించడం ద్వారా విద్యార్థుల సామర్థ్యాలు తెలుస్తాయని.. తద్వారా బోధనలో మార్పులు చేయొచ్చని ఇంకొందరు భావిస్తున్నారు. ప్రతీ పేపర్‌కు ప్రాధమిక స్థాయిలో రూ.2, ఉన్నత విద్యలో రూ.3ను ఉపాధ్యాయులకు రెమ్యూనేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ లెక్కన జిల్లాలోని 1,641 ప్రభుత్వ పాఠశాలల్లో 1,41,819 విద్యార్థులు ఉండగా, అసెస్‌మెంట్‌–1కు రూ.3,57,950, అసెస్‌మెంట్‌–2కు రూ.7,15,900 వెచ్చించాల్సి వస్తోంది. ఇలా రాష్ట్రమంతటా నిధులు కేటాయిస్తే ప్రభుత్వంపై భారం పడనుంది.

ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పరీక్షలను సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ 1, 2గా నిర్వహించి జవాబు పత్రాలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులే దిద్ది మార్కులు అందిస్తున్నారు. ఈ విధానంలో మూల్యాంకనం, మార్కుల ప్రకటన మొక్కుబడిగా మారుతుందనే విమర్శలున్నాయి. ఉపాధ్యాయులు ఎక్కువ మార్కులు వేస్తుండడంతో నాణ్యత ప్రమాణాలు తగ్గుతున్నాయనే ఆరోపణలు వస్తుండగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఈ విధానానికి స్వస్తి పలుకుతూ సరికొత్త ప్రణాళికను తీసుకొచ్చింది. ఈ విధానంలో నిష్పపక్షపాతంగా మార్కులు కేటాయిస్తారని, తద్వారా లోపాలు తగ్గి విద్యార్థులకు వారి ప్రతిభ తెలిసి చదువుపై శ్రద్ధ కనబరిచే అవకాశముందనే భావన వ్యక్తమవుతోంది.

పాఠశాల స్థాయి పాఠశాలలు విద్యార్థులు

ప్రాథమిక 1,084 67,417

ప్రాథమికోన్నత 245 44,703

ఉన్నత 312 29,699

మొత్తం 1,641 1,41,819

ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ఆధారంగా ఈ పరీక్షల నుంచే జవాబుపత్రాల మూల్యాంకనం జరుగుతుంది. ఎస్‌ఏ–1 పరీక్షల నుంచే అమల్లోకి రానుంది. నిపక్షపాతంగా, పారదర్శకంగా విధానం అమలుకు కృషి చేస్తాం.

– శంభుప్రసాద్‌, జిల్లా విద్యాశాఖాధికారి

సీసీఈ విధానంలో విద్యార్థి విజ్ఞాన మదింపు పాఠశాలలో సబ్జెక్టు ఉపాధ్యాయుల ద్వారానే జరగాలి. అలా చేయకపోతే విద్యార్థులకు మార్కుల్లో అన్యాయం జరుగుతుంది. ఈ అంశంపై కమిషనర్‌కు లేఖ ఇచ్చాం.

– బుటారి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీపీటీఎఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement