పాల్వంచరూరల్: గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో మల్టీపర్పస్ వర్కర్లు కీలకంగా నిలుస్తున్నారని అదనపు కలెక్టర్ విద్యాచందన తెలిపారు. పాల్వంచ మండలం జగన్నాథపురంలోని రైతువేదికలో బుధవారం స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా వర్కర్లకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వర్కర్లకు గతంలో తీసుకున్న బీమా పాలసీ రెన్యూవల్ చేశామని తెలిపారు. పారిశుద్ధ్య పనులు చేపట్టే క్రమాన ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం డీఈఓ అనూష మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రత, పారిశుద్ధ్య పరిరక్షణలో వర్కర్లు కీలకంగా నిలుస్తున్నారని తెలిపారు. జెడ్పీ సీఈ నాగలక్ష్మి మాట్లాడుతూ విధినిర్వహణలో సేఫ్టీ కిట్లు ధరించాలని సూచించారు. ఎంపీడీఓ పి.రాజారావు, ఎంపీఓ షబ్నా, గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులు వర్కర్లు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలకం
బూర్గంపాడు: గ్రామాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలకంగా నిలుస్తున్నాయని జిల్లా పంచాయతీ అధికారి అనూష, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి తెలిపారు. ఈమేరకు కార్మికుల ఆరో గ్యం, భద్రతపై అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మండలంలోని సారపాకలో బుధవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం కార్మికులకు బీమా, ఆరోగ్యంపై అవగాహన కల్పించాక ప్రత్యేక కిట్లు అందజేశారు.


