భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం వైభవంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలోని రామ సేవామండపంలో స్వామివారిని కొలువుదీర్చిన అర్చకులు.. నిత్య కల్యాణమూర్తులకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు.
కొత్తగా 30 విజయ పాల సహకార సంఘాలు
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాల్లో పాడి పరిశ్రమాభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతున్నామని విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కె.రవికుమార్ తెలిపారు. ఈమేరకు కొత్తగా ఉమ్మడి జిల్లాలో 30 విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని బుధవారం వెల్లడించారు. ఈ సంఘాల నమోదు ప్రక్రియ ‘సహకార్‘ పోర్టల్‌లో జరుగుతోందని తెలిపారు. అలాగే, నాణ్యమైన పాల ఉత్పత్తి పెంచేలా పాడి రైతులు, ఉత్పత్తిదారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పశువుల కొనుగోలు కోసం రైతులకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, యూనియన్ బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వడంతో పాటు, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఏఐసీ) ద్వారా పశు బీమా కల్పిస్తున్నామని తెలిపారు. ఇందులో 85 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే, లబ్ధిదారులు 15 శాతం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఆవుకు రూ.40వేల బీమా కాగా రూ.180, గేదెకు రూ.30వేల విలువైన బీమాలో రూ.133 చెల్లించాలని సూచించారు.
గ్యాస్ ఈ–కేవైసీ
గడువు ముగిసింది..
ముందుకు రాని వారికి సరఫరాపై సందిగ్ధత
పాల్వంచరూరల్: గ్యాస్ వినియోగదారులు ఈ–కేవైసీ చేయించుకోవాల్సిన గడువు బుధవారంతో ముగిసింది. మరోమారు పొడిగిస్తారనే భావనతో కొందరు ఉండగా, పొడిగించకపోతే సరఫరా ఆగిపోతుందని, సబ్సిడీ అందదనే ప్రచారంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 4,69,075 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అక్టోబర్ 1వ తేదీలోగా ఈ–కేవైసీ చేయించుకునేలా గడువు విధించారు. ప్రస్తుతం గడువు ముగిసిన నేపథ్యాన చేయించుకోని గృహ విని యోగదారులకు సిలిండర్లను సరఫరాను ఏజెన్సీలు నిలిపివేసే అవకాశముంది. కాగా, గడువు పొడిగింపు, ఈ–కేవైసీ చేయించుకోని వారి పరిస్థితిపై ఆరా తీసేందుకు జిల్లా పౌరసఫరాలశాఖ అధికారి ప్రేమ్‌కుమార్‌ను ఫోన్‌లో ద్వారా ప్రయత్నించగా స్పందించలేదు. ఇదే అంశంపై పాల్వంచ హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ–కేవైసీ చేయించుకోని వారికి ఐదు, పది కేజీల సిలిండర్లు మాత్రమే సరఫరా జరుగుతాయని స్పష్టం చేశారు.
పింఛన్ల దరఖాస్తులపై విచారణ పూర్తి
చుంచుపల్లి: కొత్తగా చేయూత పింఛన్ల కోసం అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ బుధవారంతో ముగిసింది. గతనెల 15 వరకు దరఖాస్తులను స్వీకరించగా, జిల్లావ్యాప్తంగా మొత్తం 19,346 దరఖాస్తులు అందాయి. వీటి విచారణ క్షేత్రస్థాయిలో బుధవారం వరకు పూర్తి చేశారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారు సమర్పించిన వివరాలు వాస్తవమా, కాదా అని ఆరా తీయడంతో పాటు కుటుంబ పరిస్థితులు, నివాసం తదితర అంశాలను పరిశీలించారు. వీటిని క్రోడీకరించాక నిబంధనల ప్రకారం పింఛన్‌కు అర్హులను గుర్తించి, జిల్లా స్థాయిలో జాబితాలు రూపొందిస్తారు.
పత్తి కొనుగోలుకు
ఆరు కేంద్రాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో పత్తి కొనుగోలుకు ఆరు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ పి.వేణుగోపాల్ తెలిపారు. కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, బూర్గంపాడు మార్కెట్ల పరిధిలో సీసీఐ ద్వారా ఆరు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రప్రభుత్వం పత్తి క్వింటాకు రూ.8,667 మద్దతు ధర నిర్ణయించిందని, తేమ 8 – 12 శాతంగా ఉంటేనే ఈ ధర అందుతుందని తెలిపారు. రైతులు 88972 81111 వాట్సాప్ నంబర్ ద్వారా క్రాప్ బుకింగ్‌లోని వివరాలు తెలుసుకోవచ్చని అదనపు కలెక్టర్ సూచించారు. ఈసమావేశంలో జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి అలీం తదితరులు పాల్గొన్నారు.


