వైఎస్సార్ హయాంలో
పనుల ప్రారంభం...
ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యం
రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల
మారెళ్లపాడు లిఫ్ట్ ద్వారా తుమ్మలచెరువుకు నీటి విడుదల
గోదావరి
జలాలతో
అశ్వాపురం: వర్షాభావ పరిస్థితులు ఎదురైనా పినపాక నుండి పాలేరు వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందించి సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు సీతారామ ప్రాజెక్ట్ సమీపాన నిర్మించిన మారెళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని బుధవారం ఎంపీ బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ అంకిత్ తదితరులతో కలిసి ప్రారంభించి తుమ్మలచెరువుకు గోదావరి జలాలను వదిలారు. అనంతరం గొందిగూడెంలో డెలివరీ సిస్టర్న్ వద్ద గోదావరి జలాలకు పూజలు చేశారు.
నీరు వదలడం నా అదృష్టం
రైతుల చిరకాల కోరిక అయిన తుమ్మలచెరువుకు నీరు వదిలేలా మారెళ్లపాడు లిఫ్ట్‌ను పది నెలల్లో ఎమ్మెల్యే పాయం కృషితో పూర్తి చేశామని.. ఇప్పుడు నీరు వదలడం అదృష్టమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గతంలో గోదావరి జలాలు దుమ్ముగూడెం నుంచి రోళ్లపాడుకు, అక్కడి నుంచి బయ్యారం వెళ్లి ఇల్లెందు నియోజకవర్గానికి అందాల్సి ఉన్నా గత ప్రభుత్వం అలైన్‌మెంట్ మార్చిందన్నారు. ఈమేరకు జూలూరుపాడు టన్నెల్, లలితాపురం వద్ద ఎత్తిపోతల పథకంతో పాటు ఇల్లెందులో సవరించిన అంచనాలు సిద్ధం చేసి సీతారామ ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. అంతేకాక కొత్తగూడెం, వైరాతో పాటు పది నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు టెండర్లు పూర్తయినందున త్వరగా పనులు చేపట్టి ఏడు లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొస్తామన్నారు. ప్రగళ్లపల్లి లిఫ్ట్ ద్వారా పాలెంవాగు, తాలిపేరు, మోడికుంటవాగుతో భద్రాచలంలో అన్ని మండలాలకు సాగునీరు, పినపాక నియోజకవర్గంలో పులుసుబొంత ప్రాజెక్ట్, దోమలవాగు బ్యాలెన్స్ రిజర్వాయర్ నిర్మాణాలకు కృషి చేస్తామని తెలిపారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా తొలి విడతలో 4,300 ఎకరాలకు, ఆపై దశలవారీగా 23వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులు చేపడుతున్నామని చెప్పారు. పులుసుబొంత ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, అటవీ శాఖకు ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు జరుగుతున్నందున త్వరలోనే రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు విస్తరించి రోజుకు సుమారు 500 మంది సేవలు పొందేలా తాము వచ్చాకే కృషి చేశామని తెలిపారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, ఎస్పీ రోహిత్‌రాజ్, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, సీఈ శ్రీనివాసరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో 2005 డిసెంబర్ 31న దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుకు పునాదులు వేశారని, ఆయన హయాంలోనే మారెళ్లపాడు వరకు పనులు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. వైఎస్సార్ హయాంలో చేపట్టిన దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్ ప్రాజెక్ట్‌ను గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుగా మార్చిందన్నారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభంతో అశ్వాపురం, పినపాక ప్రాంత రైతుల దశాబ్దాల కల నెరవేరిందని తెలిపారు. కుడి కాల్వ పనులు రూ.130 కోట్లతో పనులు చేపడుతుండగా, సుమారు 11,981 ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. తుమ్మల చెరువు ప్రధాన కాల్వ బలోపేతం, కాంక్రీట్ లైనింగ్, 22 కి.మీ. డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రులను కోరారు. అలాగే, గొందిగూడెం, వెంకటాపురం వంటి గిరిజన గ్రామాలతో పాటు మణుగూరు ప్రాంతంలోని రెగులగండి చెరువుకు నీటి సరఫరా, బూర్గంపాడు ప్రాంతంలోని దొమ్మలవాగు రిజర్వాయర్‌ను మినీ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.


