మారిస్తే బాగు.. అలా వద్దు ! | - | Sakshi
Sakshi News home page

మారిస్తే బాగు.. అలా వద్దు !

Sep 24 2026 1:36 AM | Updated on Sep 24 2026 1:36 AM

● లక్ష్మీతాయారు ఉపాలయ దిశ మార్పుపై చర్చ ● రామదాసు కాలం నాటి స్థానమే సరైనదని ఓ వర్గం ● ఆగమశాస్త్రం అనుసరించాలంటున్న వైదిక పెద్దలు

తుది నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

● లక్ష్మీతాయారు ఉపాలయ దిశ మార్పుపై చర్చ ● రామదాసు కాలం నాటి స్థానమే సరైనదని ఓ వర్గం ● ఆగమశాస్త్రం అనుసరించాలంటున్న వైదిక పెద్దలు

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి, పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయాన తొలగించిన లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయం పునర్నిర్మాణంపై చర్చ మొదలైంది. ఉపాలయాన్ని గతంలో ఉన్న చోటులో కాకుండా మూలమూర్తులకు కుడి వైపున ప్రతిష్ఠించాలని వైదిక పెద్దలు కోరుతున్నారు. అయితే దీనిపై స్థానికులు ఆక్షేపణలు వ్యక్తం చేయడం చర్చకు దారి తీసింది.

చారిత్రక వారసత్వం

భక్తరామదాసు కాలం నాటి ఆలయ నిర్మాణం, స్థానం, దిశలను చారిత్రక వారసత్వంగా పరిగణించాలని ఓ వర్గం కోరుతోంది. ఈమేరకు భద్రాద్రి పరిరక్షణ సమితి పేరుతో బూసిరెడ్డి శంకర్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. అప్పట్లో లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిని ప్రత్యేకంగా ఏర్పాటుచేసి తూర్పుముఖంగా ప్రతిష్ఠించారని అందులో పేర్కొన్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న సన్నిధి, ఆరాధనా సాంప్రదాయంలో మార్పులు చేయడానికి ముందు ఆగమ పండితులు, వైదిక నిపుణుల అభిప్రాయాలను తప్పనిసరిగా తీసుకోవాలని కోరుతున్నారు. భక్తుల వాదన ప్రకారం గతంలో ఆలయ విస్తరణ, పునరుద్ధరణ జరిగిన సందర్భాల్లోనూ లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిని ప్రస్తుత స్థానంలోనే కొనసాగించినందున ఇప్పుడూ అదే నియమం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

శాస్త్ర ప్రకారమే..

ఆలయ అభివృద్ధిని ఆగమ శాస్త్రం ప్రకారమే చేపట్టాలని వైదిక పెద్దలు కోరుతున్నారు. ఇందులో భాగంగానే ఆగమ శాస్త్రం, సంప్రదాయం ప్రకారమే సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్య మూలమూర్తులకు కుడిపక్కన శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, ఎడమ ప్రక్కన గోదాదేవి, లక్ష్మీ అమ్మవారికి ఎదురుగా భక్త రామదాసు, గోదాదేవికి ఎదురుగా కనక సీతా అమ్మవారి ఉపాలయాలను నిర్మించాలని వారు చెబుతున్నారు. ఫలితంగా వరుస క్రమంలో ఉపాలయాలను దర్శించుకుంటూ స్వామి వారి మూలమూర్తుల పరిపూర్ణ దర్శనం పూర్తవుతుందని పేర్కొంటున్నారు. అలాగే, భక్త రామదాసు కాలంలో ఉపాలయాల నిర్మానం చేపట్టలేదని, వైష్ణవ సంప్రదాయ ప్రకారం లక్ష్మీ అమ్మవారి ఉపాలయాన్ని అనంతర కాలంలో నాటి పరిస్థితులకు తగినట్లుగా నిర్మించినట్లు చెబుతున్నారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా తామేం సూచనలు చేయలేదని.. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన సౌకర్యాలు, క్యూలైన్లు, ప్రాంగణాల విస్తరణ, ఉపాలయాల పునర్నిర్మాణం అవసరమని అభిప్రాయపడుతున్నారు.

ఉపాలయాల నిర్మాణంపై ప్రభుత్వం, దేవాదాయ శాఖ తీసుకునే తుది నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే వైదిక పెద్దలు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు విన్నవించగా.. మరో వైపు భద్రాద్రి పరిరక్షణ పేరుతో కూడా లేఖలు సమర్పించారు. దీంతో అన్ని పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యాన వివాదం పరిష్కారానికి ఆగమ పండితులు, వైదిక బృందం, స్తపతులు, నిపుణులు, అధికారులు, భక్త సమాజాలతో కలిసి పరిశీలించాలనే సూచనలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement