భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో స్వామివారిని కొలువుదీర్చి కల్యాణమూర్తులకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు.
బీటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
మణుగూరు టౌన్: మండలంలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్)లో సాంకేతిక లోపం ఎదురైంది. దీంతో ఒకటో యూనిట్‌లో 540 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఈనెల 9వ తేదీన మూడో యూనిట్ అంతరాయం ఏర్పడి మరమ్మతులు కొనసాగుతుండగానే ఒకటో యూనిట్ కూడా మొరాయించడం గమనార్హం. అయితే, బొగ్గు నిల్వలు లేకపోవడంతోనే ఉత్పత్తి నిలిపివేశారనే ప్రచారం నేపథ్యాన సీఈ బిచ్చన్నను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. జీ–15 బొగ్గు సుమారు 97వేల టన్నుల మేర నిల్వ ఉందని, ఒకటో యూనిట్‌లోని రోటర్ ఎగ్జాస్ట్‌లో సాంకేతిక లోపం కారణంగానే ఉత్పత్తి నిలిచిపోయిందని తెలిపారు.


