సంక్షేమ పథకాలు, రక్షణ చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల, తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ల్యాండ్, సర్వీస్( ఆర్‌ఓఆర్), అట్రాసిటీస్ అంశాలపై ముగ్గురు కమిషన్ సభ్యులతో కలిసి సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుల వివరాలు, ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగుల సంఖ్య, భర్తీ కానీ బ్యాక్‌లాగ్ పోస్టుల వివరాలపై ఆరా తీశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రక్షణ చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ విధానం అమలుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, సీడీపీఓలు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజనుల కోసం భద్రాద్రి మార్ట్ ఏర్పాటు చేయడంపై ఐటీడీఏ పీఓ రాహుల్‌ను అభినందించారు. చైర్మన్ పోలీస్ శాఖ నివేదిక అడుగగా, ఎస్పీ రోహిత్‌రాజు మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 1,115 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందులో 51 కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయని, 20 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేశామని, రెండింటిపై హైకోర్టు స్టే ఉందని, 9 కేసుల్లో లీగల్ ఒపీనియన్ అవసరం ఉందని, 20 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. అనంతరం పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కమిషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్,నీలాదేవి, డీబీఎఫ్ శంకర్, పీఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, ఇతర అధికారులుపద్మావతి, సునీత, శ్రీలత, ఉపేందర్, నాగలక్ష్మి,అనూష, బాబురావు, మహేందర్ పాల్గొన్నారు.
భద్రాద్రి మార్ట్.. భేష్
భద్రాచలం: గిరిజనాభివృద్ధికి భద్రాచలంలో భద్రాద్రి మార్ట్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకట య్య అన్నారు. సోమవారం ఆయన మార్ట్ ను ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. అటవీ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి, గిరిజన ఎస్‌హెచ్‌జీ గ్రూప్ మహిళలు, గిరిజన రైతులకు ఆర్థికంగా చేయూత అందించాలని అన్నారు. అధికారులు డేవిడ్ రాజ్, రాంబాబు, జయరాజ్, విజిలెన్స్ కమిటీ మెంబర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
రామాలయంలో ప్రత్యేక పూజలు
శ్రీ సీతారామ చంద్రస్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులకు పూజలు చేశా రు. పండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాలను అందించారు.


