సూపర్‌బజార్(కొత్తగూడెం): అటవీ, రెవెన్యూ భూ సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మణాల్ శ్రేష్ట, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, అటవీ శాఖ అధికారులు, తహసీల్దార్లు, సర్వేయర్లతో కలిసి సమీక్షించారు. పాపకొల్లు గ్రామంలోని అటవీ, ప్రభుత్వ, పట్టా భూముల సరిహద్దులు, పాత రికా ర్డులకు సంబంధించిన భూ వివాదంపై చర్చించా రు. పాత ఖాస్రా పహాణీ, రెవెన్యూ రికార్డులు, ప్రస్తుత రికార్డులను పరిశీలించి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. అశ్వాపురం పరిధిలోని తుమ్మలచెరువు, మామిళ్లగూడెం ప్రాంతాల్లో అటవీ సరిహద్దుకు వెలుపల ఉన్న భూములకు సంబంధించిన లబ్ధిదారుల దరఖాస్తులు, పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ ప్రక్రియపై కూడాసమీక్షించారు. ఎన్‌హెచ్–930 పి విస్తరణకు సంబంధించిన అటవీ భూముల మళ్లింపు, ప్రత్యామ్నాయ అటవీకరణ భూముల గుర్తింపు అంశాలపై చర్చించారు. వెట్‌ల్యాండ్స్ గుర్తింపు, సంరక్షణపై కూడా కలెక్టర్ సమీక్షించారు. పోలవరం బ్యాక్‌వాటర్స్, పులుసుబొంత ప్రాజెక్టు, సింగరేణి సీఏ భూములపై కూడా చర్చించారు. అనంతరం నీటి పారుదల ప్రాజెక్టుల భూసేకరణ, పరిహారం, పునరావాసంపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు.
సీఎస్సార్ నిధులతో ట్యాబ్‌లు
కరూర్ వైశ్య బ్యాంక్ యాజమాన్యం సీఎస్‌ఆర్ నిధులతో రూ 5,63,509 విలువైన 25 ట్యాబ్‌లను కలెక్టర్ అంకిత్‌కు సోమవారం అందజేసింది. బ్యాంక్ ప్రతినిధులు కిషోర్ వర్మ, బాలాజీ సురేష్, ఖుద్దూస్, సీపీఓ సునీత పాల్గొన్నారు.
అటవీ– రెవెన్యూ భూ సమస్యపై
కలెక్టర్ అంకిత్


