బ్రిడ్జి మంజూరై రెండేళ్లయినా..
● రంగాపురం నుంచి నవభారత్ వరకు అడుగుకో గొయ్యి ● నిత్యం ప్రమాదాలు జరిగి గాయపపడుతున్న వాహనదారులు ● పదేళ్లవుతున్నా పూర్తికాని 30వ నంబర్ జాతీయ రహదారి పనులు
పాల్వంచరూరల్: నిత్యం రద్దీగా ఉండే 30వ నంబర్ జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. విజయవాడ నుంచి భద్రాచలం మీదుగా జగదల్‌పూర్ వెళ్లే ఈ మార్గంలో రోడ్డు గుంతలమయంగా తయారైంది. వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సివస్తోంది. నవభారత్ నుంచి రంగాపురం వద్ద ఉన్న కిన్నెరసాని బ్రిడ్జి వరకు గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్దమ్మతల్లి గుడి, బస్వతారాకకాలనీ, లక్ష్మీదేవిపల్లి, ఆరోగ్యమాతచర్చి, సీ కాలనీ గేట్, అంబేద్కర్‌సెంటర్, లారీఅసోసియేషన్ హాల్,పాతపాల్వంచ, నవభారత్ వరకు అడుగడుగునా గుంతలు ఉన్నాయి. ఇక వర్షం కురిస్తే వర్షపునీరు చేరి గుంతలు కనిపించడంలేదు. ఫలితంగా బైక్‌లు, ఆటోలు నిత్యం ప్రమాదాలకు గురై ప్రయాణికులు క్షతగాత్రులుగా మారుతున్నారు. కనీసం ప్యాచ్ వర్క్ అయినా చేపట్టి గుంతలు పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.
దశాబ్దం గడుస్తున్నా పూర్తికాని పనులు
సారపాక నుంచి రుద్రంపూర్ వరకు చేపట్టిన జాతీయ రహదారి పనులు దశాబ్దం గడుస్తున్నా పూర్తి కాలేదు. మూడో ప్యాకేజీ కింద రూ.299 కోట్లతో 42 కిలోమీటర్ల మేర పనులు చేపట్టి, 2017 నాటికి పూర్తిచేయాలని నేషనల్ హైవే అథారిటీ నిర్దేశించింది. కానీ పనులు దక్కించుకున్న సంస్థ పనులను అసంపూర్తిగా వదిలేసింది. ప్రధాన రహదారి పనులతోపాటు డ్రె యినేజీ, ఫుట్‌పాత్ పనులు చేపట్టాల్సిఉంది.
● ప్రధాన రహదారిపై పాల్వంచలో సీతానగర్ కాలనీ నుంచి సీకాలనీ గేటు వరకు సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా మరో లేయర్ తారు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అసంపూర్తిగా వదిలివేయడంతో పాత తారు లేచిపోయి గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది.
● కేశవాపురం కల్వర్టు వద్ద నిర్మించిన కొద్దిరోజులకే రోడ్డు కుంగిపోగా తిరిగి మరమ్మతులు చేశా రు. అయినా వర్షాలకు మళ్లీ కోతకు గురైంది. అక్కడే నడిరోడ్డుపై గుంత ఏర్పడగా, తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. ఇక్కడ ఫుట్‌పాత్ కూడా పూర్తిచేయకపోవడంతో డ్రెయినేజీ నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది.
● లక్ష్మీదేవిపల్లిలోని సాంఽఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సమీపంలో రోడ్డు బీటలువారింది. జగన్నాధపురం, నాగారంకాలనీ మధ్య ఆర్‌టీఏ చెక్‌పోస్టు వద్ద రోడ్డు దెబ్బతిన్నది. నవభారత్ వద్ద కల్వర్టు పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
● రోడ్డు మద్యలో డివైడర్లను కూడా అసంపూర్తిగానే నిర్మించారు. మూలములుపుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. పాల్వంచ బస్టాండ్ నుంచి పెద్దమ్మగుడి వరకు డివైడర్ మధ్యలో అక్కడక్కడా అసంపూర్తిగా వదిలేశారు. దీంతో బైక్‌లు, కార్లు, ఆటోలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి.
డిగ్రీ కళాశాల వద్ద అసంపూర్తిగా డివైడర్
అంబేద్కర్ సెంటర్‌లో..
రంగాపురం వద్ద కిన్నెరసాని బ్రిడ్జి నిర్మాణ టెండర్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. జాతీయ రహదారిపై 20 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్ పనులు, డ్రెయినేజీ పనులు పూర్తిచేయాల్సిఉంది. మరో లేయర్ తారు కూడా వేయాల్సి ఉంది. పలుమార్లు కాంట్రాక్ట్ పొందిన రాజ్‌దీప్ కంపెనీకి నోటీసులు కూడా జారీ చేశారం. అయినా స్పందనలేదు. దీంతో కాంట్రాక్ట్ రద్దు చేసి, కొత్తవారికి పనులు కేటాయించాలని ఏడాది క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. –టి.రామకృష్ణ, ఎన్‌హెచ్ ఈఈ
జాతీయ రహదారిపై పాల్వంచ, బూర్గంపాడు మండలాల మధ్య కిన్నెరసాని బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. గతంలో కిన్నెరసాని పొంగిపొర్లడంతో బ్రిడ్జి కోతకు గురైంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిపివేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. 2024లో రూ.22 కోట్లతో బ్రిడ్జి మంజూరైనా ఇప్పటివరకు పనులు చేపట్టలేదు. టెండర్ పూర్తికాలేదని అధికారులు చెబుతున్నారు.


