● భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో బాధితుల అవస్థ ● కొత్తగూడెం, ఖమ్మం వెళ్లి రావాలంటే వ్యయప్రయాసలు
భద్రాచలంఅర్బన్: రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో కొత్తగా తొమ్మిది అత్యాధునిక 3–టెస్లా ఎంఆర్‌ఐ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నెల 10న శాసనమండలిలో వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్కొక్కటిగా ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నా నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రజలకు వైద్యానికి పెద్దదిక్కుగా ఉన్న భద్రాచలం ఆస్పత్రిలో మాత్రం ఎంఆర్‌ఐ లేదు. ఆస్పత్రికి వచ్చిన బాధితులు ఎంఆర్‌ఐ అవసరమైతే కొత్తగూడెం, ఖమ్మం వెళ్లాల్సివస్తోంది.
బాధితులపై ఆర్థికభారం
వ్యాధిని గుర్తించి తదుపరి చికిత్సను నిర్ణయించడంలో ఉపయోగపడే ఎంఆర్‌ఐ పరీక్ష భద్రాచలంలో అందుబాటులో లేకపోవడంతో ఏజెన్సీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ఏజెన్సీ మండలాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు గ్రామాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి నుంచి ఎంఆర్‌పై కోసం కొత్తగూడెం వెళ్లాలంటే 40, ఖమ్మం వెళ్లాలంటే 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. దీంతో బాధితులకు వ్యయప్రయాసలు తప్పడంలేదు. ఇక ప్రైవే టు కేంద్రాల్లో ఎంఆర్‌ఐ తీయిస్తే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ఆర్థికభారం తప్పడంలేదు. రాష్ట్రంలో తొమ్మిది కొత్త ఎంఆర్‌ఐలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భద్రాచలంలో కూడా ఎంఆర్‌ఐ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.


