భద్రాచలంటౌన్: భద్రాచలం బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ధనసరి నాగమణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ భవాని నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ తదితరులు ప్రిన్సిపాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
పామాయిల్ గెలల ధర పెంచాలి
దమ్మపేట: పామాయిల్ గెలలు టన్నుకు రూ. 25 వేలకు పెంచి ఇవ్వాలని తెలంగాణ పామాయిల్ రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వినతిపత్రం ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు సంఘం బాధ్యులు అలపాటి రామచంద్ర ప్రసాద్, నల్లమల వెంకటేశ్వరరావు కేంద్ర మంత్రిని కలిసి సమస్యలు వివరించారు.
అథ్లెటిక్స్‌లో జిల్లాకు
ఆరు పతకాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): పాండిచ్చేరిలో ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహించిన సౌత్ జోన్ జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌న్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు ఆరు పతకాలు సాధించారు. ఈ మేరకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె మహీధర్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. మూడు బంగారు, మూడు కాంస్య పతకాలు గెలుచుకున్నారని తెలిపారు. కరకగూడేనికి చెందిన తోలెం శ్రీ తేజ, పాల్వంచకు చెందిన ఆర్.అభినవ్ నాయక్, చర్లకు చెందిన ఎం.శ్రీ విద్య దొర, భద్రాచలానికి చెందిన షేక్ అమ్రీన్ కాంస్య, డి పృథ్విక బంగారు, కాంస్య పతకాలు సాధించారని వివరించారు. విజేతలను కోచ్‌లు పి నాగేందర్, జన్ను గిరిప్రసాద్, డి.మల్లికార్జున్‌రావు, రమేష్, అసోసియేషన్ బాధ్యులు సారంగపాణి, జిల్లా క్రీడల అధికారి ఎం.పరంధామరెడ్డి తదితరులు అభినందించారు.
ఆధునిక పద్ధతులు
పాటించాలి
డీఏఓ బాబూరావు
ములకలపల్లి: అధిక పంట దిగుబడులు పొందేందుకు ఆధునిక పద్ధతులు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) బాబూరావు సూ చించారు. వ్యవసాయ సాంకేతిక యాజ మాన్య సంస్థ (ఏటీఎంఏ) ఆధ్వర్యంలో మండలపరిధి లోని పొగళ్లపల్లిలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శుక్రవారం నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. సర్పంచ్ మడకం రవి, అధికారులు భరత్, రవికుమార్, అరుణ్ బాబు,సుజాత, రమేష్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
యూరియా విక్రయాలపై విచారణ
ములకలపల్లిలో యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లువెత్తుతున్న ఆరోపణలపై డీఏఓ బాబూరావు విచారణ చేపట్టారు. శుక్రవారం రైతువేదికలో పలువురు రైతులతో మా ట్లాడి, వివరాలు సేకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ .. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రైతులు పర్వతనేని అమర్‌నాథ్, నరాటి ప్రసాద్, కరుటూరి కృష్ణ, తన్నీరు నాగయ్య, ఊకంటి రవికుమార్, నందమూరి సురేష్, నల్లమోతు జగదీష్, సురభి రాజేష్, బింగి శేషగిరి, గుమ్మడి దేవస్వామి తదితరులు పాల్గొన్నారు.
గిరిజన మ్యూజియానికి హంగులు
భద్రాచలం: దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా గిరిజన మ్యూజియాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నట్లు ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన అధికారులతో కలిసి మ్యూజియాన్ని పరిశీలించారు. చేపట్టాల్సిన పనులపై చర్చించారు. మ్యూజియంలోని బోటింగ్, సెల్ఫీ పాయింట్లను అభివృద్ధి చేయడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సందర్శకుల భద్రత కోసం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


