● వన సంపద సంరక్షణలో పలువురి ప్రాణత్యాగం ● గత నెలలో విద్యుత్ ఉచ్చుతో ఎఫ్‌బీఓ నవీన్ మృతి ● నాలుగేళ్ల క్రితం ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావు హత్య
నేడు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం
చుంచుపల్లి: వన సంపదను కాపాడే క్రమంలో అటవీ అధికారులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. విధినిర్వహణలో అటవీ సిబ్బంది చేసిన త్యాగాలను స్మరించుకునేందుకు ఏటా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుతున్నారు. 1730, సెప్టెంబరు 11న రాజస్థాన్‌లోని ఖేజర్లీలో చెట్లను కాపాడేందుకు అమృతాదేవి బిష్ణోయ్‌తోపాటు వందలాది మంది ప్రాణత్యాగం చేశారు. వారిని స్మరిస్తూ జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
జిల్లాలో అధికంగా అటవీ విస్తీర్ణం
జిల్లా భౌగోళిక విస్తీర్ణం 6,985.65 చదరపు కిలోమీటర్లు కాగా, అందులో అటవీ విస్తీర్ణం 2,861.66 చదరపు కిలోమీటర్లు ఉంది. కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, కిన్నెరసాని వన్యప్రాణి ప్రాంతాల్లో అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 608 మంది అటవీశాఖలో విధులు నిర్వహిస్తున్నారు. ఆక్రమణల నుంచి అడవిని కాపాడే క్రమంలో, కలప స్మగ్లింగ్, వేటగాళ్ల విద్యుత్ ఉచ్చులు, తుపాకులతో వన్యప్రాణుల వేటను నిరోధించే క్రమంలో నిత్యం దాడులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఇద్దరు అధికారులు ప్రాణత్యాగం చేశారు.
స్మగ్లర్ల దాడిలో..
కొత్తగూడెం ప్రాంతానికి చెందిన సోలెమన్ రాజ్ అటవీ శాఖలో బీట్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తూ 1987 నవంబరు 4న కలప స్మగ్లర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. భద్రాచలం నార్త్ డివిజన్‌కు చెందిన అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎన్.రామ్మూర్తి 2006 మే 26న విధి నిర్వహణలో భాగంగా కలప స్మగ్లర్లను అడ్డుకునేందుకు వెళ్లి గోదావరి సుడిగుండంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. భద్రాచలం సౌత్ డివిజన్‌కు చెందిన అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ బి.సోమయ్య 2012 డిసెంబరు 12న స్మగ్లర్ల చేతిలో హత్యకు గురయ్యాడు.
శ్రీనివాసరావు హత్య.. మరిచిపోలేని విషాదం
ఇటీవలి కాలంలో జిల్లాను కుదిపేసిన ఘటన అటవీ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు హత్య. 2022 నవంబర్ 22న జిల్లాలోని ఎరబ్రోడు ప్రాంతంలో అటవీ భూముల ఆక్రమణను అడ్డుకునే క్రమంలో జరిగిన దాడిలో ఆయన మృతి చెందాడు. ఈ ఘటన అటవీ అధికారుల భద్రతపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. లక్ష్మీదేవిపల్లి సెంట్రల్ పార్కుకు ఆయన పేరు పెట్టడంతోపాటు విగ్రహాన్ని ఏర్పాటు చేసి అటవీశాఖ ఆయన త్యాగాన్ని స్మరించుకుంటోంది.
తాజాగా ఎఫ్‌బీఓ నవీన్ మృతి..
గత నెల 11న పాల్వంచ రేంజ్‌లో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చుకు బలయ్యాడు. వన్యప్రాణులను వేటాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చులను తొలగించే క్రమంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో అటవీ సిబ్బంది భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. వేటగాళ్లు అమర్చే విద్యుత్ తీగలు, ఉచ్చులు రాత్రి సమయాల్లో బయటకు కనిపించకపోవడంతో ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ప్రాణాంతకంగా మారుతోంది.
నేడు ర్యాలీ
జాతీయ అటవీ అమరుల దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుంచి సెంట్రల్ పార్కు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అమరవీరుల కుటుంబాలను సన్మానిస్తారు.
నా భర్త చలమల శ్రీనివాసరావు అటవీ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. మా కుటుంబానికి ప్రభుత్వం, అటవీశాఖ చాలా అండగా నిలిచాయి.
–సీహెచ్.భాగ్యలక్ష్మి
అటవీ సంరక్షణలో ముందుండే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, ఇతర ఫ్రంట్‌లైన్ సిబ్బంది క్లిష్టమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారి సేవలు అభినందనీయం. అటవీశాఖ అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం.
–సిద్ధార్ధ్ విక్రమ్ సింగ్, డీఎఫ్‌ఓ


