టేకులపల్లి : మండలంలోని సులానగర్, సీతారాంపురం స్టేజి మధ్య జాతీయ రహదారి 930పీ పరిధిలో మంజూరైన టోల్‌గేట్ నిర్మాణం కోసం వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు పరిహారం పెంచాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.13 లక్షలు ఇస్తామని చెప్పడం సరికాదని, రూ. కోటి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీ కమిషన్‌తోపాటు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, టేకులపల్లి తహసీల్దార్ వీరభద్రం టోల్‌గేట్ ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించారు. నిర్వాసిత భూములను పరిశీలించి రైతులతో మాట్లాడారు. తమ కుటుంబాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రూ. కోటి పరిహారంతోపాటు ఇంటికో ఉద్యోగం కోరారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్పందిస్తూ పరిహారం పెంచే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే డిమాండ్ పరిష్కారమయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు స్పష్టం చేశారు. కాగా, టోల్‌గేట్ ఏర్పాటుకు సుమారు 18 మంది రైతులు భూములు కోల్పోనున్నట్లు అధికారులు గుర్తించారు.
అదనపు కలెక్టర్ ఎదుట టోల్‌గేట్
నిర్వాసిత రైతుల డిమాండ్


