భద్రాచలంఅర్బన్: ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పిస్తున్న రోజే భద్రాచలం పట్టణంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది. పట్టణంలోని జగదీశ్ కాలనీకి చెందిన అనుకోజు ప్రభాకర్(25) వడ్రంగి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ మూడేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి 11 నెలల పాప ఉంది. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య కొన్ని నెలలుగా పుట్టింట్లోనే ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే భార్య పుట్టింటికి వెళ్లిన సందర్భాల్లో పాపను చూసేందుకు వచ్చిన ప్రభాకర్‌కు అతడి భార్యకు పలుమార్లు గొడవలు జరిగినట్లు తెలిసింది. ఓ సందర్భంలో వివాదం చేయి చేసుకునే వరకు వెళ్లడంతో భార్య స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈక్రమాన టౌన్ పోలీసులు ప్రభాకర్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాల తర్వాత కొంతకాలంగా మనస్తాపానికి గురైన ప్రభాకర్ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన అవగాహన ర్యాలీ నిర్వహించిన నాడే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికులను కలచివేసింది. 11 నెలల చిన్నారి తండ్రిని కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
కుటుంబ మనస్పర్థల నేపథ్యాన
యువకుడి బలవన్మరణం


