నీటి ఎద్దడి.. బోరు సందడి! | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి.. బోరు సందడి!

Sep 11 2026 9:58 AM | Updated on Sep 11 2026 9:58 AM

గిరిజన బాలుర వసతి గృహంలో నీటి కష్టాలు పనిచేయని బోరు.. బంద్‌ అయిన ‘భగీరథ’ పంచాయతీ ట్రాక్టర్‌ ద్వారానే సరఫరా తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లిన సీఐటీయూ, విద్యార్థులు విద్యార్థుల కాలినడకపై సీరియస్‌..

దమ్మపేట: మండల కేంద్రంలోని దమ్మపేట గిరిజన బాలుర వసతి గృహంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గత మూడు రోజులుగా మిషన్‌ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో వసతి గృహానికి అతిసమీపంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి సరఫరా చేసిన నీటిపైనే ఆధారపడాల్సి వచ్చింది. మొత్తం 106 మంది విద్యార్థులకు గాను బుధవారం 70 మంది ఉండగా పంచాయతీ తీసుకొచ్చిన నీరు ఏమాత్రం సరిపోవడం లేదు. నీటిని పొదుపుగా వాడుకుంటూ కాలకృత్యాలకు బహిర్భుమికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమాన సమస్యను సీఐటీయూ ఆధ్వర్యాన విద్యార్థులతో కలిసి ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌(తహసీల్దార్‌) దృష్టికి తీసుకెళ్లగా ఆయన శాశ్వత పరిష్కారం చూపారు.

రెండేళ్లుగా మూలనపడ్డ బోరు..

వసతి గృహంలో ఉన్న బోరు గత రెండేళ్లుగా పనిచేయడం లేదు. రిపేర్‌కు ప్రయత్నించగా.. లోపల విద్యుత్‌ మోటార్‌ ఇరుక్కుని బయటకు రాలేదు. దీంతో అధికారులు అలానే వదిలేశారు. దీనిపై ఐటీడీఏ అధికారులు ఏ మాత్రం చొరవ చూపలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు తాగునీటితో పాటు ఇతర అవసరాలకు మిషన్‌ భగీరథ నీటిపైనే ఆధారపడుతున్నారు.

పంచాయతీ నీరే ఆధారం..

గత 20 రోజుల క్రితం భగీరథ నీరు ఆగిపోవడంతో సమీపంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలోని మినీ వాటర్‌ ట్యాంకు నుంచి తాత్కాలికంగా నీటిని సరఫరా చేశారు. మళ్లీ మూడు రోజుల క్రితం భగీరథ నీరు నిలిచిపోవడంతో అదే పంచాయతీ నీటిని తాగడానికి, వంటకు, అరకొరగా అత్యవసరాలకు వాడుకుంటూ స్నానాలు చేయకుండా రెండు రోజుల పాటు కాలం వెళ్లదీశారు. ఈక్రమాన మూడవ రోజు (బుధవారం) పంచాయతీ నుంచి నీరు సరఫరా అవుతున్న క్రమాన కరెంట్‌ పోవడం, తిరిగి వచ్చాక మోటార్‌ ఆన్‌ చేయకపోవడంతో ఆ నీరు కూడా ఆగిపోయింది. దీంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండా వసతి గృహంలోనే ఉండిపోయారు. కాగా, పంచాయతీ నుంచి ఎక్కువ నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా, అవగాహన లోపంతో వసతి గృహ బాధ్యులు ఆ దిశగా పంచాయతీని సంప్రదించలేదు.

కిలోమీటర్‌ నడిచి తహసీల్దార్‌కు వినతి

గిరిజన వసతి గృహంలో నీటి కష్టాలపై కిలోమీటర్‌ దూరంలో ఉన్న తహసీల్దార్‌ కార్యాలయానికి విద్యార్థులను సీఐటీయూ నాయకులు కాలినడకన తీసుకెళ్లి ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌(తహసీల్దార్‌) మద్దినేని మురళికి బుధవారం వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన ఆయన ఆర్‌డబ్ల్యూస్‌ అధికారులతో మాట్లాడి భగీరథ నీటిని సాయంత్రం 4 గంటలకు పునరుద్ధరించారు. అనంతరం వసతి గృహాన్ని సందర్శించిన తహసీల్దార్‌ విద్యార్థులను రాజకీయాలకు వాడొద్దని, ఇలా విద్యార్థులు నడిచే క్రమాన ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌ కృష్ణబాబు, సీఐటీయూ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులను బలవంతంగా తీసుకెళ్లినట్టుగా వార్డెన్‌తో పాటు విద్యార్థులు సైతం చెప్పారు. దీంతో విద్యార్థుల భద్రత, వసతుల విషయంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం యుద్ధప్రాతిపదికన ఐటీడీఏ నిధులతో వసతి గృహం ఎదుట నీటి బోరు వేయించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. శుక్రవారం నాటికి బోరులో విద్యుత్‌ మోటార్‌ను ఏర్పాటు చేసి, నీటి బోరును వినియోగంలోకి తేవాలని ఆధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement