సివిల్స్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 11 2026 9:58 AM | Updated on Sep 11 2026 9:58 AM

భద్రాచలంటౌన్‌: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు సిద్ధమవుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ సూచించారు. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ ఆధ్వర్యాన హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో ఎనిమిది నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై, 21–32 ఏళ్ల వయస్సు, రూ.3 లక్షల్లోపు వార్షిక ఆదాయం కలిగిన అభ్యర్థులు ఈనెల 23 సాయంత్రం 6 గంటల్లోపు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఈనెల 27న స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించి, అర్హత సాధించిన వారిని శిక్షణకు ఎంపిక చేస్తామని పీఓ ఓ ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రస్థాయి ఖో–ఖో పోటీలకు బాలికల జట్టు ఎంపిక

కల్లూరు రూరల్‌: రాష్ట్ర స్థాయి ఖో–ఖో పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి ఖమ్మం బాలికల జట్టును గురువారం ఎంపిక చేశారు. కల్లూరులోని మినీ స్టేడియంలో జరిగిన ఎంపిక పోటీలకు 101 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబర్చిన గొంది మౌనిక, జమిలి రవళిక, గుండు రాధిక, గోనె శ్రావణి, కడారి భవాని, ధరావత్‌ ప్రవళిక, ఊకే మాధవి, కారం సమ్మక్క, వెంకటలక్ష్మి, శీలం తేజశ్రీ, మోకాళ్ల కావ్య, షేక్‌ సాదికతో జట్టును ఖరారు చేశారు. ఈ జట్టు 17వ తేదీన హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈకార్యక్రమంలో ఖో–ఖో అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీరరాఘవయ్యతో పాటు కాటేపల్లి కిరణ్‌, మట్టూరి జనార్దన్‌, ఈ.నరసయ్య, ఎస్‌.రామారావు, ఎస్‌.ప్రసాద్‌, బి.బీమా, పి.సతీష్‌ కుమార్‌, కె.తులసి, రమాదేవి, త్రివేణి పాల్గొన్నారు.

మానసిక ఒత్తిడిని

ధైర్యంగా ఎదుర్కోవాలి

డీఎంహెచ్‌ఓ తుకారాం రాధోడ్‌

పాల్వంచ: మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటేనే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ అన్నారు. గురువారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ, కేఎల్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. వ్యక్తుల్లో ఏర్పడే ఆత్మహత్య ఆలోచనలు, మానసిక ఒత్తిడి, నిరాశ, భావోద్వేగ సమస్యలను మనసులోనే దాచుకోకుండా, ఒంటరిగా ఉండకుండా కౌన్సెలర్లు, మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం లేదా కుటుంబ సభ్యులు, స్నేహితులు, విశ్వసనీయ వ్యక్తులతో చర్చించాలన్నారు. ఎవరైనా తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్నట్లు గమనిస్తే వెంటనే ఉచిత హెల్ప్‌లైన్‌ నంబర్‌ 14416కు ఫోన్‌ చేసి కౌన్సెలింగ్‌ పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌, అధ్యాపక సిబ్బంది, విద్యార్ధులు, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

‘పాతకాలం’

పేరుతో కొత్త మోసం

‘1980’ట్రెండ్‌ మాటున సైబర్‌ వల!

నకిలీ యాప్‌లు, ఏపీకే ఫైళ్లతో ముప్పు

ఫొటో ఎడిటింగ్‌ పేరుతో చోరీకి అవకాశం

అనధికార యాప్‌లు వాడొద్దని

నిపుణుల సూచన

భద్రాచలంఅర్బన్‌: సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతున్న ‘1980 ఫొటో’ట్రెండ్‌ను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది. తమ ఫొటోలను 1980–90ల నాటి పాతకాలపు లుక్‌లోకి మార్చుకుని వాట్సాప్‌ స్టేటస్‌, ఇన్‌స్ట్రాగామ్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో పెట్టేందుకు యువత ఆసక్తి చూపుతోంది. ఇదే అదనుగా ‘1980 ఫొటో’, ‘రెట్రో ఫొటో ఎడిటర్‌’తదితర పేర్లతో నకిలీ యాప్‌లు, ఏపీకే ఫైళ్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే అవకాశం ఉందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అనుకున్న ఫొటోలు రాకపోవడంతో..

ఏఐ ఆధారిత అధికారిక సేవల్లో ఆశించిన విధంగా ఫొటో రాకపోవడం, వినియోగ పరిమితులు ఎదురవడం వంటి కారణాలతో కొందరు ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని లింకులు, వాట్సాప్‌, టెలిగ్రామ్‌ ద్వారా వచ్చే ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్‌ చేసుకుంటే ప్రమాదంలో పడే అవకాశముంది. ఇలాంటి అనధికార యాప్‌లకు ఫొటోలు, కాంటాక్టులు, ఎస్‌ఎంఎస్‌లు తదితర అనుమతులు ఇస్తే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంటుంది. ఫొటో ఎడిటింగ్‌ ట్రెండ్‌ను అనుసరించే క్రమంలో సైబర్‌ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దని, యాప్‌లను అధికారిక యాప్‌ స్టోర్ల నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సైబర్‌ భద్రత నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement