● రూ.68.8 కోట్లతో తొలి విడత అభివృద్ధి పనులు ● భద్రగిరిలో ఘాట్ల విస్తరణ, డార్మెటరీ హాళ్ల నిర్మాణం ● ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో రూ.46.65 కోట్ల పనులు
భద్రాచలం: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు భద్రగిరి ముస్తాబవుతోంది. సమయం సమీపిస్తుండటంతో భక్తులకు అవసరమైన వసతులు కల్పించే పనులకు శ్రీకారం చుట్టారు. తొలిదశగా జిల్లాకు కేటాయించిన రూ.68.8 కోట్లతో వివిధ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గోదావరి స్నానఘాట్ల విస్తరణ, పాత ఘాట్ల పునరుద్ధరణ, భక్తుల వసతి సౌకర్యాలపై దృష్టి సారించారు. ఇటీవలే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్ కొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. అంబ సత్రం సమీపాన భక్తుల వసతి కోసం జీ+1 అంతస్తులో డార్మెటరీ హాల్, గోదావరి ఒడ్డున నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు తరలిరానుండటంతో ప్రధానంగా వసతి, స్నానఘాట్లపై దృష్టి సారించారు.
ఘాట్ల అభివృద్ధికి పెద్దపీట
ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో రూ.46.65 కోట్లతో పలు పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న ఘాట్‌ను విస్తరించడంతో పాటు హనుమాన్ దేవాలయం, పాత మెట్లు, ఇతర నిర్మాణాలను తొలగించేందుకు రూ.72 లక్షలు కేటాయించారు. కొత్త ఘాట్ విస్తరణ, మల్టీపర్పస్ మండపం, టాయిలెట్ బ్లాక్, ర్యాంప్ నిర్మాణం, పాత ఘాట్ల మరమ్మతులకు రూ.35.60 కోట్లు వెచ్చించనున్నారు. స్నానపు గదుల నిర్మాణానికి మరో రూ.62 లక్షలు కేటాయించారు. వీటికి టెండర్ ప్రక్రియ పూర్తిచేసి పనులు మొదలుపెట్టగా, మిగిలిన పనులను దశలవారీగా చేపడతారు.
మిగిలిన శాఖల ద్వారా కూడా..
పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం గోదావరి కారిడార్ పరిధిలో మొత్తం రూ.వేయి కోట్లు ప్రకటించింది. రెండు విడతల్లో పనులు చేపట్టాలని నిర్ణయించగా.. తొలి విడతగా రూ.646 కోట్ల పనులకు ఆమోదం లభించింది. ఇందులో భద్రాద్రి జిల్లాకు రూ.68.8 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధుల్లో ఇరిగేషన్ శాఖకు రూ.46.7 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.17.6 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.3 కోట్లు, దేవాదాయ శాఖకు రూ.1.5 కోట్లు కేటాయించారు. పుష్కరాలకు ముందే పనులు పూర్తి చేసి భక్తులకు ఇబ్బంది రాకుండా చూసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పనుల నాణ్యత, గడువులోగా పూర్తి చేయడం, భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడం కీలకంగా మారింది.
కొత్త ఘాట్లకు మంగళం
గోదావరి పుష్కరాల సందర్భంగా భద్రాచలంలో మినహా ఎక్కడా కొత్త ఘాట్లు నిర్మించడం లేదు. తొలుత ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం, మోతె, వాజేడు వద్ద కొత్త ఘాట్లకు ప్రతిపాదించినా ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. కేవలం పాత ఘాట్ల విస్తర్ణణ, మౌలిక వసతుల కల్పనపైనే దృష్టి సారించింది. ఇటీవల భద్రాచలంలో పర్యటించిన మంత్రుల సూచనలతో మళ్లీ దుమ్ముగూడెం వద్ద నూతన ఘాట్ నిర్మాణానికి రూ.8.73 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రక్రియ ఆలస్యమైనందున, అనుమతి వచ్చే అవకాశం తక్కువేనని తెలుస్తోంది. గత పుష్కరాలకు రూ.50 లక్షల మంది రాగా.. ఈసారి కోటి దాటతారనే అంచనా ఉండగా, పాత ఘాట్లపైనే ఆధారపడాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. భక్తుల సంఖ్యకు తగినట్లుగా ప్రభుత్వం నూతన ఘాట్ల నిర్మాణంపై దృష్టి సారించాలనే వినతులు వస్తున్నాయి.


