టేకులపల్లి: పాఠశాలల్లో విద్యాబోధనకే ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. మండలంలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించారు. కొన్ని తరగతుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో లేకపోవడాన్ని గుర్తించి, తరగతి సమయాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో బోధనపైనే దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడారు. ప్రయోగశాలలను పరికరాలు నిల్వ చేసే ప్రదేశాలుగా కాకుండా విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించే కేంద్రాలుగా వినియోగించుకోవాలని సూచించారు. కొత్తగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు యూనిఫాం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భోజనశాల, వంటగది, మరుగుదొడ్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు. వెల్నెస్ సెంటర్‌లో మందులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు పూర్తి జవాబుదారీతనంతో పనిచేస్తూ ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీఓ కొండపల్లి శ్రీదేవి, ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణవ, ఎంఈఓ జగన్, ఏపీఓ కె.శ్రీనివాస్, కార్యదర్శి విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


