కల్యాణం... కమనీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం... కమనీయం

Sep 10 2026 12:27 AM | Updated on Sep 10 2026 12:27 AM

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలోని శ్రీరామ సేవామండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని పూర్తిచేశారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అభివృద్ధి పనుల్లో

వేగం పెంచాలి

భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి, పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచి ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తర ద్వార దర్శనం, పుష్కరాల నాటికి ఘాట్ల పనులు పూర్తిచేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్‌ సూచించారు. ఆలయ అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించిన ఆయన ప్లాన్‌ ఆధారంగా అధికారులతో సమీక్షించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ భక్తుల కోసం సౌకర్యాల మెరుగుపర్చడం, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి జరిగేలా నాణ్యతతో చేపట్టాలని సూచించారు. దేవస్థానం ఈఓ దామోదర్‌రావు, ఐటీడీఏ ఈఈ మధుకర్‌, దేవస్థానం ఈఈ రవీందర్‌, ఆర్కిటెక్చర్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

పౌష్టికాహారంపై

అవగాహన పెంచాలి

భద్రాచలంఅర్బన్‌: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు పోషకాహార లోపం నివారణపై క్షేత్రస్థాయిలో అవగాహన పెంచాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ సూచించారు. ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం 9వ పోషణ మాస కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా సంక్షేమ అధికారిణి జె.స్వర్ణలత లెనీనా, ఇతర అధికారులు రాధమ్మ, ప్రతాప్‌, పొనుగోటి సంపత్‌, బి.రాము తదితరులు పాల్గొన్నారు.

తెగుళ్ల నివారణపై శిక్షణ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పత్తి, మిరప, మొక్కజొన్న, వరి పంటల్లో చీడపీడలు, తెగుళ్ల నివారణపై బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నాలుగు మండలాలకు చెందిన గిరిజన రైతులకు జీవనోపాధి భద్రతలో భాగంగా ఒక మేకల యూనిట్‌ (20+1) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ టి.భరత్‌ వివిధ పంటల్లో వచ్చే చీడపీడలు, తెగుళ్లపై రైతులకు అవగాహన కల్పించారు. మేకల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందాలని సూచించారు. ఎఫ్‌పీఓ చైర్మన్‌ పి పాపారావు, రైతులు పాల్గొన్నారు.

రేపు జాబ్‌మేళా

రుద్రంపూర్‌: కొత్తగూడెంలోని వీవీసీ మోటార్స్‌లో 90 ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఈనెల 11న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష్మీదేవిపల్లిలోని వెంకటరమణ మోటార్స్‌ టాటా షోరూమ్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఐటీఐ, ఇంటర్‌ ఒకేషనల్‌ చేసినవారు అర్హులని పేర్కొన్నారు.

20న శతాధిక

కవి సమ్మేళనం

భద్రాచలంటౌన్‌: శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 20న భద్రాచలంలోని పాల్‌రాజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 176వ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు వేదిక జాతీయ అధికార ప్రతినిధి వరలక్ష్మి సాయిరాం తెలిపారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 200 మంది కవులు పాల్గొంటారని అన్నారు. డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌, ఈశ్వరీభూషణం, డాక్టర్‌ పార్థసారథి, సురేష్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement