సూపర్‌బజార్(కొత్తగూడెం): గణపతి ఉత్సవాల భద్రతకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. డీఎస్పీలు ఆదినారాయణ, మల్లయ్య స్వామి, రవీందర్ రెడ్డి, వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు.
బాల్యవివాహాలు నిర్వహిస్తే చర్యలు
బాల్యవివాహాలు నిర్వహించినా, సహకరించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ సభ్యులు ఎస్పీని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాల్యవివాహాలు నిర్వహిస్తే, 1098 లేదా డయల్ 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వి.రాజేష్, సభ్యులు మోహన్, మాన్‌సింగ్, రవిచంద్ర, నాగేంద్రబాబు, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ తనిఖీ
చుంచుపల్లి: చుంచుపల్లి పోలీస్ స్టేషన్, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలర్టింగ్ ఆఫీసర్లు, రౌండింగ్ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని, రాత్రి వేళలో నిఘా పెంచాలని ఆదేశించారు.పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. ప్రధాన రహదారులు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసుల విజిబిలిటీ పెంచాలని ఆదేశించారు. డయల్–112కు ఫోన్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందించాలని సిబ్బందికి సూచించారు.
ఎస్పీ రోహిత్ రాజు


