వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు | - | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు

Sep 10 2026 12:27 AM | Updated on Sep 10 2026 12:27 AM

బీజేపీకి ఖమ్మంలో గెలిచే దమ్ముంది

ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనని కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి ఘోరంగా తయారైందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే కాంగ్రెస్‌ ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొన్నారు. ముగ్గురు మంత్రులతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఏ ఒక్క మేలైనా జరిగిందా అని ప్రశ్నించారు. భద్రాచలంలో బుధవారం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.

పెనం మీద నుంచి పొయ్యిలోకి

కేసీఆర్‌ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్‌ 32 నెలల్లో రూ.3 లక్షల కోట్ల అప్పు చేసిందని, దీంతో తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లయిందని అన్నారు. 22ఏ నిషేధిత జాబితాలో కోటి ఎకరాల భూమిని చేర్చి ప్రజలను రాచి రంపాన పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు పవర్‌ ఫుల్‌ మంత్రులున్నా ఈ జిల్లాకు చేసింది గుండు సున్నా అని ఆయన దెప్పిపొడిచారు.

ప్రధాని మోదీ ఇస్తున్నవే

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల నిధులన్నీ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇస్తున్నవేనని మంత్రి అన్నారు. జిల్లాలో 7 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, పాల్వంచ ఇండస్ట్రియల్‌ పార్క్‌ అప్‌ గ్రేడేషన్‌ కోసం రూ. 8 కోట్ల గ్రాంట్‌ కేంద్రం మంజూరు చేసిందన్నారు. కొత్తగూడెంలో ఎయిర్‌ పోర్టు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. ప్రసాద్‌ స్కీంలో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి అభివృద్ధికి కోసం రూ.41 కోట్లు, పాండురంగాపురం–మల్కాన్‌గిరి రైలు మార్గానికి రూ. 3,592 కోట్ల వ్యయాన్ని కేంద్రం భరిస్తుందన్నారు. ఖమ్మం లో గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే 5 ప్యాకేజీల కింద దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, కోదాడ–ఖమ్మం–కావూరి రోడ్‌ నేషనల్‌ హైవే నిర్మాణానికి రూ. 446 కోట్లకు ఆమోదం లభించిందన్నారు. పీఎం ఆవాస్‌ యోజన స్కీం పేరును మార్చబోననే మాట ఇస్తే తెలంగాణకు పది లక్షల ఇళ్లు కేంద్రం నుంచి మంజూరు చేయించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు బండి ప్రకటించారు. తొలుత కుటుంబ సమేతంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ధర్మా, సంతోష్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి బలం లేదని చెప్పడాన్ని తాను ఖండిస్తున్నట్టు వెల్లడించారు. గతంలో నిరుద్యోగ మార్చ్‌ చేస్తే ప్రభంజనంలా జనం తరలివచ్చారని, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మీటింగ్‌కు లక్ష మందికి పైగా హాజరయ్యారని గుర్తుచేశారు. ఖమ్మంలో బీజేపీ కేడర్‌ పవర్‌ ఫుల్‌గా ఉందన్నారు. పాలుపోసే వాడు, డ్రైవర్‌ సహా కార్యకర్త నిలబడ్డా ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచేలా బీజేపీని బలోపేతం చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో అన్ని అసెంబ్లీ స్థానాల గెలుపే తమ లక్ష్యమన్నారు. చిన్న చిన్న అభిప్రాయ బేధాలుంటే పక్కనపెట్టి సమష్టిగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కేసులకు భయపడకుండా గెలుపుకోసం పోరాడాలని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.

ముగ్గురు మంత్రులతో జిల్లాకు ఒరిగింది శూన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement