ఎవరు.. బెటర్‌ ?! | - | Sakshi
Sakshi News home page

ఎవరు.. బెటర్‌ ?!

Sep 10 2026 12:27 AM | Updated on Sep 10 2026 12:27 AM

ఎవరి ధీమా వారిదే..

రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేల తీరుపై ఆరా బీఆర్‌ఎస్‌లో మాజీ ఎమ్మెల్యేల మార్క్‌పైనా ప్రశ్నలు సమీపంలో ఎన్నికలు లేకున్నా సీట్లపై అంచనాలు

రాజకీయ వేడి

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఇంకా మూడు నెలలు గడిస్తే మూడేళ్లు పూర్తవుతుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే తామే ప్రజా సంక్షేమంలో మేటిగా ఉన్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు చెప్పుకొస్తున్నారు. ఏ చిన్న సమావేశాన్ని కూడా వదలకుండా ప్రభుత్వ పథకాలను వల్లె వేస్తున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే, తాము వచ్చాక ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పట్టాలెక్కింది.. సమస్యలు పరిష్కారం అయ్యాయని చెబుతున్నారు. ఇదే సమయాన ‘రెండేళ్లు వేచి చూశాం.. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైంది’ అంటూ బీఆర్‌ఎస్‌ నేతలు వారం రోజుల ఆందోళనలు చేపట్టారు. ఆ పార్టీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెట్టారు. మరోపక్క వామపక్ష పార్టీలు, బీజేపీ కూడా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో నిరసనలు చేపడుతున్నాయి. 2028 చివరి నాటికి ఎన్నికలు జరుగుతాయనే ఉద్దేశంతో రెండేళ్ల ముందు నుంచే పార్టీలు తమ వాణి పెంచినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రజానాడి పసిగట్టేలా..

ఎన్నికలు ఇప్పట్లో లేకున్నా ప్రజల నాడి తెలుసుకునేందుకు పార్టీలు సర్వే బాట పట్టినట్లు సమాచారం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు నియోజకవర్గాల వారీగా ప్రతీ మూడు నెలలకోసారి ఈ ఏడాది ఇప్పటికే రెండు సర్వేలు పూర్తి కాగా తాజాగా అన్ని నియోజకవర్గాల్లో చేస్తున్నట్లు తెలిసింది. ఈ సర్వేలో ‘కాంగ్రెస్‌ పార్టీ మంత్రి / ఎమ్మెల్యే పనితీరు ఇప్పటి వరకు ఎలా ఉంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయా.., బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పనితీరు గతంలో ఎలా ఉండేది.. ఇద్దరిలో ఎవరు, ఏ ప్రభుత్వం బెటర్‌, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి, ఏ నేత బరిలో ఉంటే ఓటేస్తారు’ అంటూ సుమారు పదిహేను వరకు ప్రశ్నలు ప్రజలను అడుగుతున్నారు. పట్టణ, మండల, మేజర్‌ గ్రామ పంచాయతీ కేంద్రాల్లోనే ఈ సర్వేలు జరుగుతున్నాయి.

నివేదికల ఆధారంగా ప్రణాళిక

ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నందున ప్రస్తుతం చేయిస్తున్న సర్వే నివేదికలతో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవచ్చనే భావనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లోనూ ఈ సర్వే రిపోర్టుల ఆధారంగానే స్థానిక నేతల కార్యక్రమాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. మరోపక్క పనితీరు బాగా లేదని నివేదిక వచ్చిన వారికి పార్టీ అధిష్టానం చురకలు అంటిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వేలో వ్యక్తిగత వైఫల్యాలపై ఆరా తీస్తూ పనితీరు మార్చుకోవాలని వ్యక్తిగతంగానే సూచిస్తున్నట్లు సమాచారం. ప్రజల్లో నిరంతరం ఉంటూ కార్యక్రమాల ద్వారా ఎన్నికల వరకు ఊపు కొనసాగిస్తే అధికారం తమదేనని నేతలకు పార్టీలు దిశానిర్దేశం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సర్వే నివేదికలు ఎలా ఉన్నా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఫలానా నియోజకవర్గాలు తప్పకుండా తమ ఖాతాలోకే వస్తాయని చెప్పుకుంటున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా తీర్పు ఉంటుందని బీఆర్‌ఎస్‌.. ఉమ్మడి జిల్లా అంతా మరోమారు స్వీప్‌ చేస్తామంటూ కాంగ్రెస్‌ ధీమాగా ఉన్నాయి. ఇవికాక బీజేపీ కూడా ఏయే నియోజవర్గాల నుంచి ఎవరిని బరిలోకి దింపాలి.. ఉమ్మడి జిల్లాలో నేతల్లో ఎవరు క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారని సర్వే చేయించినట్లు సమాచారం. ఇలా పార్టీల వారీగా సర్వేలతో ఆసక్తి నెలకొంది.

‘కాంగ్రెస్‌ ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి.., మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేల్లో ఎవరు బెటర్‌’ అంటూ ప్రజలకు ప్రశ్నలు సంధిస్తూ ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో జోరుగా సర్వేలు సాగుతున్నాయి. సాధారణ ఎన్నికలు ఇప్పట్లో లేకున్నా సర్వేలు రాజకీయ కాక పుట్టిస్తున్నాయి. ఈ సర్వేలను ఆయా పార్టీలు, నేతలే స్వయంగా చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నివేదికల ఆధారంగా ఎన్నికల నాటికి ఎలా సిద్ధం కావాలనే వ్యూహాల్లో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

– సాక్షి ప్రతినిధి, ఖమ్మం

ఉమ్మడి జిల్లాలో జోరుగా రాజకీయ సర్వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement