చుంచుపల్లి: బాలుడు చనిపోయాక చికిత్స అందిస్తున్నట్లు నటించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన కిరణ్, యశోద దంపతులు తమ ఐదు నెలల బాబుకు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో కొత్తగూడెం గణేష్ టెంపుల్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ఉద యం డబ్బులు చెల్లించి బాబును తీసుకెళ్లాలని, ఇక వైద్యం చేయలేమని సిబ్బంది చెప్పినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు బాబును చూడటానికి కూడా తల్లిదండ్రులు, బంధువులను అనుమతించలేదని వాపోయారు. మధ్యాహ్నమే బాలుడి శరీరం మొత్తం నలుపు రంగులోకి మారి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో అప్పటికే బాబు మృతి చెంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశామని, అయినా మృతదేహానికి చికిత్స చేస్తున్నట్లు చెబుతూ మొత్తం బిల్లు చెల్లిస్తేనే బాబు ను అప్పగిస్తామని సిబ్బంది బెదిరింపులకు పాల్ప డ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి వద్ద సుమారు మూడు గంటలపాటు ఆందోళన నిర్వహించారు. ఆస్పత్రిని సీజ్ చేయాలని నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మూడో పట్టణ పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.


