ప్రమాదకరంగా పాత బ్రిడ్జి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదకరంగా పాత బ్రిడ్జి

Aug 22 2026 12:24 AM | Updated on Aug 22 2026 12:24 AM

రెండో వంతెనపై రాకపోకలెప్పుడో?

భద్రాచలం వద్ద గోదావరి వంతెనపై తరచూ ప్రమాదాలు

రెండు రోజుల క్రితం బస్సు, కారు ఢీకొని ఒకరు మృతి

పనులు ప్రారంభించి పుష్కరకాలమైనా పూర్తికాని రెండో బ్రిడ్జి

భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి బ్రిడ్జి మృత్యుపాశంలా మారుతోంది. నిత్యం లారీలు, బస్సులతో రద్దీగా ఉంటున్న పాత బ్రిడ్జిపై ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సివస్తోంది. అప్రోచ్‌ రోడ్డు కుంగటం, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం, ఇరువైపులా మరమ్మతులు పూర్తి కాకపోవడంతో రెండో నూతన బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. దీంతో మొదటి బ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరిగి, పలువురు మృత్యువాత పడుతున్నారు. దీనికి తోడు బ్రిడ్జిపై గుంతలు ఏర్పడటంతో మరింత ప్రమాదకరంగా మారింది. గత గురువారం తెల్ల వారుజామున బస్సు, కారు ఢీకొని నకిరికంటి హరీష్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే రెండో బ్రిడ్జి మరమ్మతులు పూర్తి చేసి, రెండింటిపై వన్‌వే పద్ధతి అమలు చేస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది.

గుంతలు.. రద్దీ.. వేగం

గోదావరిపై పాత బ్రిడ్జి కాలపరిమితి ముగిసిందని 12 ఏళ్ల క్రితం కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. పాత బ్రిడ్జిపై పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయి. వాహనదారులు గుంతలను తప్పించుకునే క్రమంలో ద్విచక్ర వాహనదారులకు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఎదురెదురుగా వాహనాలు ఒక్కసారిగా వస్తే మరింత ప్రమాదకరంగా మారుతోంది. రాత్రి వేళల్లో మరింత ఆందోళనకరంగా ఉంటోంది. చిరు, ప్రభుత్వ ఉద్యోగులు, కళాశాల, పాఠశాల విద్యార్థులు, వ్యాపారులు గ్రామాల నుంచి నిరంతరం భద్రాచలం రాకపోకలను సాగిస్తుంటారు. వీరు ఒక వైపు ట్రాఫిక్‌ రద్దీ, మరో వైపు గుంతలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేస్తున్నారు.

పుష్కర కాలమైనా పూర్తికాలే

భద్రాచలం వద్ద గోదావరిపై రెండో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించి 12 ఏళ్లు అవుతున్నా పనులు పూర్తికాలేదు. 2015, ఏప్రిల్‌ 1న నాటి కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కారి శంకుస్థాపన చేశారు. రూ.65 కోట్లతో పనులు దక్కించుకున్న రాజ్‌దీప్‌ కంపెనీ సకాలంలో పూర్తి చేయలేకపోయింది. తొలుత 2016, అనంతరం 2019, మళ్లీ 2021 ఇలా గడువు పొడిగించినా ఫలితంలేదు. చివరకు జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలోనే బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి రాకపోకలను ప్రారంభించింది. అయితే ఇప్పటికీ భద్రాచలం, సారపాక వైపు రెయిలింగ్‌ పూర్తి కాలేదు. దీంతో అధికారికంగా ప్రారంభానికి నోచుకోకుండానే రికార్డులోకి రామసేతు ప్రవేశించింది.

రెండో వంతెనకు సారపాక వైపు అప్రోచ్‌ రోడ్డు వద్ద మట్టి కుంగిపోయింది. దీంతో రాకపోకలను భద్రాచలం వైపు నిలిపివేశారు. ఆరు నెలలవుతున్నా పనులు పూర్తికాలేదు. ఇటీవలె రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం పూర్తయింది. సారపాక వైపు ఇరువైపులా బారికేడింగ్‌ పనులను చేపడుతున్నారు. ఇవి నెమ్మదిగా సాగుతుండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం భద్రాచలం పర్యటనకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం పరిశీలించి రెండో వంతెన పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా పనుల్లో వేగం లేదు. మరో ప్రాణం గాల్లో కలవకముందే అధికారులు మేల్కొని రెండో బ్రిడ్జి మరమ్మతులు పూర్తి చేయాలని, పాత బ్రిడ్జిపై గుంతలను పూడ్చాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement