అశ్వారావుపేటరూరల్: గంజాయి కేసులో నలుగురు వ్యక్తులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్‌లో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మండలంలోని మామిళ్లవారిగూడెం గ్రామ పంచాయతీ కోర్సవారిగూడెం గ్రామ శివారులో ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తుండగాఎస్‌ఐ టీ యయాతీ రాజు సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. వారికి పాపిడిగూడేనికి చెందిన అల్లం వెంకటేశ్వరరావు గంజాయి విక్రయించినట్లు తేలగా, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. నలుగురిపై కేసు నమోదు చేశారు. వెంకటేశ్వరరావును దమ్మపేట కోర్టులో హాజరు పరిచినట్లు, గంజాయి సేవించిన ముగ్గురిపై భద్రాచలం డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సీఐ నాగరాజు, దమ్మపేట ఎస్‌ఐ రాజేష్‌కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఈతకు వెళ్లి ..
తిరిగిరాని లోకాలకు
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతై దుర్మరణం చెందిన సంఘటన మండలపరిధిలోని పెంట్లం గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై విజయసింహా రెడ్డి కథనం ప్రకారం.. పెంట్లంలో తాపీ మేసీ్త్రగా పనిచేసే ఇనుపనూరి సంతోష్ (35), అదే గ్రామానికి చెందిన మిత్రుడు అంజితో కలిసి ఈత కొట్టేందుకు గ్రామశివారులోని చెరువు వద్దకు వెళ్లారు. ఇద్దరూ చెరువులోకి దిగిన అనంతరం అంజి బయటకు రాగా, సంతోష్ చెరువు నీటిలో గల్లంతయ్యాడు. అంజి సమాచారంతో గ్రామస్తులు, పోలీసులు గజ ఈతగాళ్లతో చెరువులో గాలింపు చేపట్టగా సంతోష్ మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


