ఆమరణ దీక్ష చేపట్టిన
ఆదివాసీ సంఘం నాయకుడు
ఆదివాసీ విద్యార్థులపై
లంబాడీ విద్యార్థుల దాడికి ఖండన
పిల్లలు, ఆదివాసీ సంఘాలతో
ఐటీడీఏ ఏపీఓ, ఆర్సీఓ చర్చలు
వైస్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసేవరకు దీక్ష విరమించబోమని ప్రతిన
గుండాల: మండలంలోని ముత్తాపురం ఏకలవ్య పాఠశాలలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆదివాసీ సంఘాల నాయకుడు ఆమరణ దీక్ష చేపట్టగా, పోలీసుల బలగాలను భారంగా మోహరించారు. రాత్రి వరకు పరిస్థితి అట్టుడికిపోయింది.
అసలేం జరిగిందంటే..
ఇటీవల ఏకలవ్య పాఠశాలలో అనుమతి లేకుండా తీజ్ వేడుకలు నిర్వహించారని, లంబాడీ విద్యార్థులు ఆదివాసీ విద్యార్థులపై దాడి చేశారంటూ ఆదివాసీ సంఘాల నాయకులు కొద్దిరోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో తీజ్ వేడుకలు నిర్వహించిన ఏకలవ్య పాఠశాల ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను నలుగురిని ఉన్నతాధికారులు బదిలీ చేశారు. అయినా ఆదివాసీ నాయకులు శాంతించకుండా ఆందోళన కొనసాగించారు. వారిలో ఒకరైన చుంచు రామకృష్ణ శుక్రవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. వైస్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసేవరకు దీక్ష విరమించబోమని భీష్మించారు. ఈ క్రమంలో ఇద్దరు ఆదివాసీ విద్యార్థులు గేటు వద్దకు వచ్చి లంబాడీ విద్యార్థులు తమపై దాడి చేశారని దీక్షలో ఉన్న ఆదివాసీ సంఘాల నాయకులకు తెలిపారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీక్ష శిబిరం నుంచి వెళ్లి కొందరు నాయకులు ఇల్లెందు – గుండాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పాఠశాలలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం
ఇల్లెందు డీఎస్పీ వెంకన్న బాబు, గుండాల సీఐ తిరుపతి , ఎస్సై శ్రావణ్ కుమార్‌లు దీక్ష శిబిరం వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. తమ పిల్లలపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని, ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రశ్నించారు. గేటు ఎక్కి పాఠశాలలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. కలెక్టర్, ఐటీడీఏ పీఓ ఆదేశాలతో ఆర్సీఓ అరుణకుమారి, ఏపీఓ డేవిడ్ రాజు భద్రాచలం నుంచి ఏకలవ్య పాఠశాలకు చేరుకున్నారు. ఆదివాసీ సంఘాల నాయకులతో చర్చలు జరిపి దీక్ష విరమించాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆదివాసీ ఎమ్మెల్యేలు, మంత్రి సీతక్క స్పష్టమైన హామీ ఇస్తే తప్ప దీక్ష విరమించేది లేదని నాయకులు తేల్చి చెప్పారు. దీంతో ఏపీఓ, ఆర్‌సీఓ పాఠశాల లోపలికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. రాత్రి వరకు విచారణ కొనసాగుతూనే ఉంది. కాగా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ఆళ్లపల్లి ఎస్‌ఐ సోమేశ్వర్, బోడు ఎస్‌ఐ రాజమౌళి, కాచనపల్లి ఎస్‌ఐ నాగుల్ మీరా, ఇల్లెందు ఎస్‌ఐ ఉమారాణి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


