● ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్ ● తండ్రి మృతి, తల్లి పరిస్థితి విషమం
ములకలపల్లి: డ్రైవర్ మద్యం మత్తు ఓ నిండుప్రాణాన్ని బలి తీసుకుంది. ములకలపల్లికి చెందిన మిర్యాల శంకర్‌రావు(55), రమాదేవి దంపతులకు కూతురు చందన, కుమారుడు వంశీ ఉన్నారు. శ్రావణ శుక్రవారం కావడంతో దంపతులిద్దరూ ద్విచక్రవాహనంపై చాపరాలపల్లిలోని కూతురి ఇంటికి బయల్దేరారు. అదే సమయంలో ఆనందపురానికి చెందిన మిడియం శంకర్‌రావు ట్రాక్టర్‌పై సిమెంట్ ఇటుకల లోడుతో చాపరాలపల్లికి వెళుతున్నాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టి సమీపంలోని పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో మిర్యాల శంకర్‌రావుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రమాదేవికి తీవ్ర గాయాలు కాగా కొత్తగూడెం ఏరియా తరలించి చికిత్స అంది స్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. డ్రైవర్ మిడియం శంకర్‌రావు మద్యం మత్తులో ట్రాక్టర్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎస్సై మధుప్రసాద్ ఘటానాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాంగ్రెస్ జిల్లా ఉపాద్యక్షుడు తాండ్ర ప్రభాకర్‌రావు, పేటేటి నర్సింహారావు, గాడి తిరుపతిరెడ్డి, శనగపాటి రవి తదితరులు నివాళులర్పించినవారిలో ఉన్నారు. కాగా, ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు.
కూతురు వివాహమైన
రెండు నెలలకే..
మిర్యాల శంకర్‌రావు, రమాదేవిల కూతురు చందనకు గత జూన్ 27న చాపరాలపల్లికి చెందిన హరీష్‌తో వివాహం జరిపించారు. శుక్రవారం పండుగ కావడంతో చూసివచ్చేందుకు కూతురి ఇంటికి వెళ్తుండగా ప్రమాదంలో తండ్రి మృత్యువాతపడ్డాడు. శుభకార్యం జరిగి రెండు నెలలు నిండక ముందే ఆ ఇంట్లో విషాదం నెలకొంది.


