● భద్రాచలం–విశాఖ జాతీయ రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ● ఏపీ పరిధిలో పూర్తయిన ఎన్‌హెచ్ సర్వే పనులు ● రవాణారంగంలో కీలకంగా మారనున్న భద్రగిరి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కేంద్రం కొత్తగా నిర్మించనున్న చింతూరు–తాళ్లపాలెం (విశాఖపట్నం) జాతీయ రహదారితో రవాణా రంగంలో భద్రాచలానికి మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా పేరున్న ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏఓబీ) ప్రాంతం మీదుగా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు సిద్ధమైంది. దీనిపై ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ సానుకూల సమాధానం ఇచ్చారు. ట్రైబల్ సబ్‌ప్లాన్ కింద విజయవాడ–జగ్‌దల్‌పూర్ జాతీయ రహదారి (30)ని, విజయవాడ – కోల్‌కతా జాతీయ రహదారి(16)తో అనుసంధానం చేస్తామని చెప్పారు. భద్రాచలం–చింతూరు–సీలేరు– చింతపల్లి– నర్సీపట్నం నుంచి తాళ్లపాలెం (విశాఖ) వరకు జాతీయ రహదారి ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కీలకంగా భద్రాచలం
ఎన్‌హెచ్ 30లో భాగంగా ఇప్పటికే భద్రాచలం నుంచి చింతూరు వరకు రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. ఇది చింతూరు నుంచి చట్టీ – కుంటల మీదుగా జగ్‌దల్‌పూర్ వెళ్తోంది. చింతూరు నుంచి సీలేరు మీదుగా నర్సీపట్నం వరకు ప్రస్తుతం సింగిల్ రోడ్డు అందుబాటులో ఉంది. పూర్తిగా ఏపీ, ఒడిశాల మధ్య సహజ సరిహద్దుగా ఉన్న సీలేరు నది పక్క నుంచి దట్టమైన అడవి గిరిజన ప్రాంతాల మీదుగా ఈ రోడ్డు సాగుతుంది. మెయింటెనెన్స్ కూడా సరిగా లేకపోవడంతో ఈ దారి గుండా ప్రయాణించేందుకు స్థానికులు తప్ప ఇతరులు మొగ్గు చూపడం లేదు. చింతూరు నుంచి మారేడుమిల్లి మీదుగా రంపచోడవరం– రాజమండ్రి రోడ్డుది ఇదే పరిస్థితి. దీంతో భద్రాచలం నుంచి తూర్పు (విశాఖ) వైపు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం అందుబాటులో లేదు. దీంతో అశ్వారావుపేట – జంగారెడ్డిగూడెం మార్గాన్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొత్త జాతీయ రహదారి నిర్మాణం జరిగితే విశాఖపట్నం, కాకినాడ వంటి రేవు పట్టణా లకు భద్రాచలం ఏజెన్సీ నుంచి నేరుగా వెళ్లేందుకు మెరుగైన రోడ్డు అందుబాటులోకి వస్తుంది.
సర్వే పూర్తి
చింతూరు వరకు ఇప్పటికే ఎన్‌హెచ్ ఉండటంతో చింతూరు – సీలేరు – చింతపల్లి – నర్సీంపట్నంల మధ్య సుమారు 320 కి.మీ మేరకు రోడ్డును జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. దీనిపై ఆర్ అండ్ బీ, విశాఖపట్నం అధికారులు 2021 ఏప్రిల్‌లోనే సర్వే చేశారు. 80 అడుగులతో రోడ్డును విస్తరించే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఆ తర్వాత రహదారి నిర్మాణ పనుల్లో కదలిక లేదు. తాజాగా ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన రూ.1700 కోట్లను ట్రైబల్ సబ్‌ప్లాన్ ద్వారా కేటాయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేయడంతో రోడ్డు పనుల్లో కదలిక వచ్చినట్టయ్యింది.
రాష్ట్ర నిధులతో..
జిల్లా మీదుగా ప్రస్తుతం ఎన్‌హెచ్ 30 ఒక్కటే ఉంది. ఇటీవల ఎన్‌హెచ్ 930పీ పనుల్లో కదలిక వచ్చింది. దీంతో ఇల్లెందు – కొత్తగూడెంల మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మాణంతోపాటు హైదరాబాద్ కు దగ్గరి దారి అందుబాటులోకి రానుంది. కాగా కొత్తగూడెం నుంచి తల్లాడ వరకు ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి వినతులు వెళ్లినా సానుకూల స్పందన లేదు. దీంతో రాష్ట్ర నిధులతోనే కొత్తగూడెం – తల్లాడ మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించే అవకాశాన్ని రాష్ట్ర సర్కారు పరిశీలిస్తున్నట్టు సమాచారం.


