ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
అశ్వారావుపేటరూరల్/దమ్మపేట/ములకలపల్లి/చండ్రుగొండ: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. సోమవారం ఆయన అశ్వారావుపేట నియోజకవర్గవ్యాప్తంగా పర్యటించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పలు గ్రా మాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు.
అశ్వారావుపేటలో..
అశ్వారావుపేట మండలంలోని కేశప్పగూడెంలో రూ.3.65 కోట్లతో నిర్మించిన హైలెవల్ వంతెనను ప్రారంభించారు. రూ.5.25 కోట్లతో నిర్మించనున్న గాండ్లగూడెం–చెన్నాపురం బీటీ రహదారికి శంకుస్థాపన చేశారు. సర్పంచ్‌లు స్వరూప, గుజ్జా సంకురరావు, పీఆర్ డీఈఈ శ్రీధర్, ఏఈ అక్షిత, ఐటీడీఏ ఏఈ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
దమ్మపేటలో
మండలంలోని పట్వారిగూడెం గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దుర్గంగొల్లగూడెం బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు వడ్డించే సాంబారులో కూరగాయల ముక్కలు లేకపోవడంతో వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ సక్రమంగా పాటించాలని హెచ్చరించారు. అధికారులు, సర్పంచ్‌లు, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లిలో..
ముత్యాలంపాడు, పాలవాగు గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రారంభించారు. పీఆర్ డీఈ శ్రీధర్, తహసీల్దార్ స్వాతిబిందు, ఎంపీడీఓ సత్యనారాయణ, సర్పంచ్‌లు కల్లూరి కిషోర్, సోడే చైతన్య, మడకం విజయం, కారం చంద్రకళతోపాటు నాయకులు జహీరుద్దీన్, ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లిలో..
ఎర్రగుంట, రామకృష్ణాపురం గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. మర్రిగూడెంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న డ్రెయినేజీనికి శంకుస్థాపన చేశారు. నాయకులు పర్సా వెంకటేశ్వరరావు, వేముల రమణ, సృజన, కృష్ణ, నరేష్, రాము పాల్గొన్నారు.
చండ్రుగొండలో..
కరిశెలబోడులో ఇందిరమ్మ ఇళ్లను, వంకనెంబర్, బాల్యతండాలో సీసీ రోడ్లను ప్రారంభించారు. తిప్పనపల్లి తండాలోని గిరిజన పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. రావికంపాడు, మహ్మద్‌నగర్, సీతాయిగూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాయకులు నల్లమోతు రమణ, భోజ్యానాయక్, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ గుగులోతు బాబు, సారేపల్లి శేఖర్, సర్పంచ్‌లు డీ రామారావు, రుక్మిణి, అధికారులు పాల్గొన్నారు.


