● భద్రాచలం రామాలయంలో పడమర మెట్ల వైపు నిర్మాణ పనులు ● ఎమ్మెల్యే చొరవతో చిరు దుకాణదారులకు ఉపశమనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనుల నేపథ్యంలో సోమవారం తూర్పు దిక్కున ఉన్న గోపురం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. గతంలో పడమర, దక్షిణం వైపున నుంచి భక్తులు వచ్చేవారు. దర్శనం అనంతరం పడమర వైపు బయటికి వెళ్లే వారు. మూడు వైపులా ఒకేసారి పనులు చేపడుతున్న తరుణంలో దక్షిణం ,పడమర వైపు రాకపోకలను నిలిపివేశారు. తూర్పు వైపు నుంచి భక్తులు ఆలయంలోకి వచ్చేందుకు తాత్కాలిక మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. ఇటే లడ్డూ కౌంటర్లు ఉండటంతో ఆ వైపుగా బయటికి వస్తున్నారు. తాత్కాలిక ర్యాంప్ సైతం ఏర్పాటు చేస్తున్నారు. సెల్‌ఫోన్లు భద్రపర్చేందుకు, టికెట్ల విక్రయానికి తాత్కాలిక గదులను అందుబాటులో ఉంచారు. పడమర మెట్ల పైభాగం కప్పు, రేకులను సోమవారం తొలగించారు. మంగళవారం మెట్లు, భవనాలు కూడా తొలగించనున్నారు.
విస్తా కాంప్లెక్స్ దుకాణాలకు స్థల పరిశీలన
విస్తా కాంప్లెక్స్ తొలగింపు ప్రక్రియపై సందిగ్ధం నెలకొంది. ఈ నెల 16 నాటికి దుకాణాలను తొలగించాలని దేవస్థానం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి కోల్పోతామని వ్యాపారులు విన్నవించడంతో కరకట్ట దిగువన తాత్కాలిక దుకాణా లకు అనుమతించాలని ఎమ్మెల్యే రెవెన్యూ అధికా రులకు సూచించారు. కాగా, ఆ పక్క స్థలంలో దేవస్థానం, ప్రైవేట్ సంస్థలకు నడుమ కోర్టులో వివా దం నడుస్తోంది. సదరు ట్రస్టు నిర్వాహకులు వారి పరిధి దాటి ప్రభుత్వ స్థలంలో సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయగా, సోమవారం ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో రెవెన్యూ, పోలీసు, దేవస్థానం అఽధికారులతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే హెచ్చరికలతో సిమెంట్ పోల్స్ తొలగించారు. అక్కడ తాత్కాలికంగా దుకాణా లను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించడంతో వ్యాపారులకు ఉపశమనం లభించింది.


