ఎంతో ఊహించా.. ఇంతేనా?! | - | Sakshi
Sakshi News home page

ఎంతో ఊహించా.. ఇంతేనా?!

Jul 24 2026 12:22 AM | Updated on Jul 24 2026 12:22 AM

భద్రగిరి ఆలయ అభివృద్ధిపై దేవాదాయ శాఖ కమిషనర్‌ హన్మంతరావు

ఇకనైనా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి

పుష్కరాల నాటికి పనులు

పూర్తి చేయాల్సిందేనని స్పష్టీకరణ

ప్లాన్‌పై అయోమయం

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి, పునర్ధురణ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఊహించుకుని వస్తే ఇక్కడ ఆ పరిస్థితి లేదని దేవాదాయ శాఖ కమిషనర్‌ హన్మంతరావు పేర్కొన్నారు. భద్రాచలానికి గురువారం వచ్చిన ఆయన చిత్రకూట మండపంతో పాటు కూల్చివేత, శిథిలాల తొలగింపు పనులను పరిశీలించారు. మొదలుపెట్టి నెల దాటినా కనీసం పనులు జరగకపోవడంపై నిర్మాణ సంస్థ ప్రతినిధులతో అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరగనున్నందున, ఎట్టి పరిస్థితుల్లో నవంబర్‌ నాటికి ఉత్తర దిక్కున పనులు చేపట్టి వేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతేకాక పుష్కరాల నాటికి మొత్తం పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇక నిత్యకల్యాణ వేదిక మార్చాలని సూచించినా తాత్కాలిక వేదిక పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నందున యంత్రాల సంఖ్య పెంచి రాత్రింబవళ్లు పూర్తి చేయాలని సూచించారు. దేవస్థానం అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎదురుచూస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన తెలిపారు.

రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ

భద్రాచలంలో అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ చేయనున్నట్లు కమిషనర్‌ హన్మంతరావు ఈ సందర్భంగా విలేకరులకు వెల్లడించారు. వారం రోజులకోసారి ఈఓ ఆధ్వర్యాన పునరుద్ధరణ కమిటీ సమావేశం, 15 రోజులకోసారి కమిషనర్‌ స్థాయిలో, నెలకోమారు మంత్రుల స్థాయిలో సమీక్ష ఉంటుందని తెలిపారు. అంతేకాక పనులు జరిగే ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమర్చనుండగా, హైదరాబాద్‌ నుంచి పర్యవేక్షణ సులభతరమవుతుందని చెప్పారు. పనుల్లో అప్పటికప్పుడు కొన్ని మార్పులు సహజమేనని, అన్నీ సరైన సమయానికి పూర్తి చేస్తామని తెలిపారు. రూ.270 కోట్లతో ప్రభుత్వం చేపట్టిన ఈ మహాయజ్ఞాన్ని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో చేపడుతామని వెల్లడించారు. అలాగే, పురుషోత్తపట్నంలోని రామయ్య భూముల్లో అక్రమ నిర్మాణదారులు, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యేలా ఫిర్యాదు చేయాలని ఈఓకు సూచించారు. అంతేకాక త్వరలో ఆ భూములను ఏపీ సర్కారు సహకారంతో పరిశీలిస్తామని వెల్లడించారు.

రామాలయ పునరుద్ధరణకు సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌పై అధికారుల్లో ఉన్న అయోమయం గురువారం మరోమారు బయటపడింది. ఉత్తర ద్వారం వేదికతో పాటుగా ప్రాకారాలు, చిత్రకూట మండపం తరలింపుపై ఇప్పటికీ పూర్తి స్థాయి ప్లాన్‌ తనకు అందించలేదని కాంట్రాక్టర్‌ చెప్పగా.. వెంటనే మార్పులను పూర్తి చేసి వెంటనే అందజేయాలని కమిషనర్‌ ఆదేశించారు. కాగా, మాస్టర్‌ప్లాన్‌ను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వెల్లడించాలని మీడియా ప్రతినిధులు పేర్కొనగా, అందరికీ వివరించాలని అధికారులకు సూచించారు. కాగా మాస్టర్‌ ప్లాన్‌లో అస్పష్టతపై ఇప్పటికే ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించింది. తొలుత భద్రాచలం వచ్చిన కమిషనర్‌ రామాలయంలో ప్రత్యేక పూజలు చేయగా పండితులు వేదాశీర్వచనం, ఈఓ దామోదర్‌రావు స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్కిటెక్‌, ఆర్‌అండ్‌బీ, దేవస్థానం ఇంజనీర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement