చుంచుపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులు, బాలింతల విషయమై నిర్లక్ష్యం చేయకుండా మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. రామవరంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేసి పలు విభాగాలను పరిశీలించి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యులు, ఉద్యోగులతో సమావేశమైన కలెక్టర్.. రోజువారీ ఓపీ, ప్రసవాలు, మందుల లభ్యతపై చర్చించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని తెలిపారు.
రైతుల ప్రయోజనాల కోసమే రీసర్వే
పాల్వంచ: రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం భూముల రీసర్వే చేయిస్తోందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. పాల్వంచ పరిధి కరకవాగులోని సర్వే నంబర్ 727లో చేపట్టిన సర్వేను గురువారం ఆయన పరిశీలించి సర్వే విధానం, భూముల హద్దుల నిర్ధారణపై అధికారులతో చర్చించారు. ప్రతిరోజూ 40 నుంచి 50 ఎకరాల మేర భూములకు సర్వే చేస్తుండగా, ఇప్పటి వరకు 580 ఎకరాల్లో పూర్తయిందని ఉద్యోగులు తెలిపారు. అయితే, కచ్చితత్వం, పారదర్శకతకు పెద్దపీట వేయాలని సూచించిన కలెక్టర్.. రైతులు సహకరించాలని తెలిపారు. తహసీల్దార్ దారా ప్రసాద్, సర్వేయర్లు, పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
ఎన్‌సీసీతో నాయకత్వ లక్షణాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): యువతలో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించేందుకు నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) కీలక పాత్ర పోషిస్తోందని కలెక్టర్ అంకిత్ అన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల ద్వారా ఎసైంటియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జిల్లాలోని 25 ఎన్‌సీసీ యూనిట్లకు రూ.9 లక్షల విలువైన శిక్షణ సామగ్రిని సమకూర్చింది. ఇందులో డమ్మీ తుపాకులు తదితర సామగ్రి ఉండగా కలెక్టరేట్‌లో కలెక్టర్ అందజేసి మాట్లాడారు. ఎన్‌సీసీ తీర్చిదిద్దిన యువత భవిష్యత్‌లో పలు రంగాల్లో రాణించడంతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి, 11వ తెలంగాణ బెటాలియన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


