అందుబాటులోకి
జియో సైన్స్ ల్యాబోరేటరీ
కొత్తగూడెంలో ప్రారంభించిన
డిప్యూటీ సీఎం భట్టి
రుద్రంపూర్: సింగరేణి గనుల్లో తవ్వకాల సందర్భంగా వెలువడే ఖనిజాల నమూనాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో రూ.13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జియోసైన్స్ ల్యాబోరేటరీని కొత్తగూడెం పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంస్థ సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ల్యాబ్‌లో అత్యాధునిక యంత్ర పరికరాలు, ఖనిజాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణకు చేసే పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. ఈ ల్యాబ్ ద్వారా ఖనిజ నమూనాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణ వేగంగా పూర్తికావడమే కాక కచ్చితమైన ఫలితాలు వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. సింగరేణిలో శాసీ్త్రయ పరిశోధనలకు ప్రోత్సాహం, గనుల్లో ఆధునికత కోసం అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, సింగరేణి డైరెక్టర్లు గౌతం పొట్రు, సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, తిరుమల్‌రావు, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజు, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేశ్, నాయకులు నాగా సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై వినతులు
సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు ఇనపనూరి నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ సింగరేణిలో 25 ఏళ్లుగా దాదాపు 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నందున కోలిండియా మాదిరి హైపవర్ వేతనాలు చెల్లించాలని లేదా జీఓ 22 అమలు చేయాలని కోరగా డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. అలాగే, కొత్తగూడెం వెళ్లే క్రమాన భట్టి రామవరంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ మోత్కూరి ధర్మారావు ఇంటికి వచ్చారు. ఆయనకు ప్రకృతి హరిత దీక్షకురాలు నైనిక రజువా మొక్క అందజేయగా భట్టి అభినందించారు. కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, మార్కెట్ చైర్మన్ లాల్‌సింగ్, నాయకులు మోత్కూరి లక్ష్మి ఝాన్సీరాణి, కుసుమ శ్రీనివాసరావు, దశరథ్ రజువా తదితరులు పాల్గొన్నారు.


